మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం
కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రి లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో ఘటన
కరీంనగర్, మే 13(విజయక్రాంతి): రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ప్రమాదం తప్పింది. మంత్రితో పాటు గన్‌మెన్లు ఆసుపత్రి లిఫ్టులో వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్‌లో మక్కల కొనుగోలు కేంద్రం వద్ద లారీ అదుపుతప్పి మంగళవారం పలువురు రైతులు గాయపడి కరీంనగర్‌లోని వన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బాధితులను పరామర్శించేందుకు మంత్రి బుధవారం రాత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. మంత్రితోపాటు వ్యక్తిగత సిబ్బంది కలిసి లిఫ్టులో మూడోఅంతస్తుకు వెళ్లుతుండగా లిఫ్ట్ వైరు తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందికి పడిపోయింది. అదృష్టవశాత్తు మంత్రితో పాటు వ్యక్తిగత సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రి పనితీరుపై తీరుపై మంత్రి మండిపడ్డారు.






