04-12-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 3 (విజయక్రాంతి): దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌గా హైదరాబాద్ మరోసారి తన సత్తా చాటింది. కోకాపేట నియోపోలిస్ కేంద్రంగా హెచ్‌ఎండీఏ నిర్వహించిన భూముల ఈ ప్రక్రియ ప్రభుత్వ ఖజానాకు కనకవర్షం కురిపించింది. బుధవారం జరిగిన మూడో విడత వేలంలో డెవలపర్ల నుంచి అదే స్థాయి స్పందన లభించింది. బడా నిర్మాణ సంస్థలు భూములను దక్కించుకునేందుకు నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డాయి.
ప్లాట్ నం. 19.. ఈ ప్లాట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. చివరికి యులా కన్‌స్ట్రక్షన్స్ ఎల్‌ఎల్ పీ, గ్లోబస్ ఇన్‌ఫ్రాకాన్ ఎల్‌ఎల్‌పీ జాయింట్‌గా దీనిని దక్కించుకున్నాయి. ఇందుకోసం వారు ఎకరాకు రూ.131 కోట్లు వెచ్చించారు. ప్లాట్ నం. 20ను ఎకరాకు రూ.118 కోట్లు చెల్లించి ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం బ్రిగేడ్ ఎంటర్ప్రుజైస్ లిమిటెడ్ కైవసం చేసుకుంది. మొదటి రెండు విడతల్లో సుమారు రూ.150 కోట్లు నమోదైన ధరలతో పోలిస్తే..
మూడో విడతలో ధరలు కొంచెం తగ్గినట్లు కనిపించినా, మొత్తంగా చూస్తే మార్కెట్ విలువ అమాంతం పెరిగింది. నియోపోలిస్ మొత్తం వేలం ప్రక్రియలో సగటున ఎకరం భూమి ధర రూ.137.36 కోట్లుగా తేలింది. 2023లో జరిగిన నియోపోలిస్ వేలం సైకిల్‌తో పోలిస్తే ప్రస్తుత సగటు ధర ఏకంగా 87 శాతం వృద్ధిని నమోదు చేసింది. కేవలం రెండేళ్ల వ్యవధిలో భూమి విలువ దాదాపు రెట్టింపు కావడం.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, మౌలిక వసతుల కల్పనపై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని నిపుణు లు విశ్లేషిస్తున్నారు.
మొత్తం మూడు దశల్లో కలిపి హెచ్‌ఎండీఏ ఏకంగా రూ.3,708 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలోని మెట్రో నగరాలైన ముంబై, బెంగళూరులతో పోటీపడు తూ హైదరాబాద్ భూముల విలువ ఆకాశాన్నంటుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ర్ట ప్రభుత్వానికి నిధుల అవసరం ఉన్న సమయంలో.. నియోపోలిస్ వేలం ద్వారా వచ్చిన రూ.3708 కోట్లు భారీ ఊరటనిచ్చాయి.
హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన మౌలిక వసతులు, స్కువేలు, అండర్ పాస్‌లు, భవిష్యత్తులో రాబోయే మెట్రో విస్తరణ వంటి అంశాలు ఈ ప్రాంతానికి డిమాం డ్ పెరగడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి డిసెం బర్ 5న జరగబోయే గోల్డెన్ మైల్ వేలంపై పడింది. నియోపోలిస్‌లో వచ్చిన ఊపు గోల్డెన్ మైల్‌లోనూ కొనసాగుతుందని, అక్కడ కూడా రికార్డు స్థాయి ధరలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.