11-08-2024 03:28:32 AM
గృహ రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి బ్యాంక్‌లు పలు అంశా ల్ని పరిగణనలోకి తీసుకుంటాయి. ఖాతాదారు క్రెడిట్ స్కోర్, తీసుకునే రుణ మొత్తం, ఎల్‌టీవీ (లోన్ టు వాల్యూ) రేషియో, ఉద్యోగం లేదా ఉపాధి తదితర అంశాలు వడ్డీ రేటు నిర్ణయంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. గృహ రుణాన్ని ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ కొనుగోలుకు, ఇల్లు నిర్మించేం దుకు స్థలం కొనుగోలు చేయడానికి, ప్రస్తుత ఇంటిని ఆధునీకరించడానికి, విస్తరించడానికి ఉపయోగించుకోవ చ్చు. గృహ రుణాలను నెలసరి సమాన వాయిదాల (ఈఎంఐలు) ద్వారా చెల్లించవచ్చు. రుణం చెల్లించివేసిన తర్వాత బ్యాంక్ ఇంటి పత్రాల్ని మీకు తిరిగి అప్పగిస్తుంది.
మూడు రకాల వడ్డీ రేట్లు
రిజర్వ్‌బ్యాంక్ తాజాగా ద్రవ్య విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్టినందున, ఆగస్టు నెలలో కూడా వివిధ బ్యాంక్‌ల రుణ రేట్లు సైతం గత స్థాయిలోనే కొనసాగుతున్నాయి. సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గించే సంకేతాల్ని సైతం ఆర్బీఐ వెల్లడించలేదు. కానీ ఈ ఏడాది డిసెంబర్‌లో ఆర్బీఐ రెపో రేటును తగ్గించే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు తగిన వడ్డీ రేటును ఎంచుకోవచ్చు. సాధారణంగా బ్యాంక్‌లు ఫ్లోటింగ్, ఫిక్స్‌డ్, మిక్స్‌డ్...ఇలా మూడు రకాల వడ్డీ రేట్లను గృహ రుణాలకు ఆఫర్ చేస్తుంటాయి. ఫ్లోటింగ్ రేటుపై గృహ రుణాన్ని తీసుకుంటే ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తే, మీ ఈఎంఐ తగ్గడం లేదా పెంచితే మీ ఈఎంఐ తగ్గడం జరుగుతుంది.
ఇప్పుడు చాలా బ్యాంక్‌లు ఫ్లోటింగ్ రేటుపైనే గృహ రుణాల్ని ఇస్తున్నాయి. ఫిక్స్‌డ్ రేటు అయితే రుణం మంజూరు చేసినపుడు నిర్ణయించిన వడ్డీ రేటే రుణ కాలపరిమితి ముగిసే వరకూ కొనసాగుతుంది. అదే మిక్స్‌డ్ రేటు అంటే తొలుత ఫిక్స్‌డ్‌గా ఉండి, తదుపరి ఫ్లోటింగ్‌లోకి మారుతుంది. గృహ రుణం అనేది మీరు దీర్ఘకాలం ఈఎంఐల ద్వారా చెల్లించాల్సి ఉన్నందున, మీకు సరసమైన వడ్డీ రేటు అందించే బ్యాంక్‌ను ఎంపిక చేసుకోవాలి. ఏ మాత్రం తక్కువ వడ్డీకి గృహ రుణం లభించినా, దీర్ఘకాలానికి మీకు అదే పెద్ద ఆదా అవుతుంది.
గృహ రుణంపై పలు పన్ను ప్రయోజనాలు సైతం లభిస్తాయి. మీకు గృహ రుణం ఉన్నట్లయితే మీ పన్ను ఆదాయం నుంచి ఈఎంఐలకు చెల్లించే వడ్డీ, అసలు మొత్తాన్ని మినహాయించుకోవచ్చు. ఇంటి కొనుగోలుకు అయ్యే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో రూ.1.5 లక్షల వరకూ మీ ఆదాయం నుంచి తగ్గించుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 24 కింద మీరు నివసిస్తున్న లేదా అద్దె పొందుతున్న ఆస్తులపై మీ గృహ రుణంపై వడ్డీని రూ.2 లక్షల వరకూ పన్ను ఆదాయం నుంచి డిడెక్ట్ చేసుకోవచ్చు.