అదానీ షెల్ కంపెనీల్లో సెబీ చీఫ్‌కు వాటాలు
- మరో బాంబు పేల్చిన హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ
- మధబి పురి బుచ్ దంపతుల పెట్టుబడులపై రిపోర్ట్
న్యూఢిల్లీ, ఆగస్టు 10: అమెరికా షార్ట్‌సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ భారత్‌కు చెందిన అదానీ గ్రూప్ అక్రమాలపై మరో బాంబు పేల్చింది. ఈసారి ఏకంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) డైరెక్టర్‌పైనే తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ షెల్ కంపెనీల్లో సెబీ చీఫ్ మధబి పురి బుచ్‌తోపాటు ఆమె భర్తకు కూడా వాటాలున్నాయని ఆరోపించింది. దాదాపు 40 మీడియా సంస్థలు నిర్వహించిన దర్యాప్తుతోపాటు పలువురు విజిల్ బ్లోయర్ల నివేదికల ఆధారంగా ఈ విషయాన్ని ధృవీకరించుకొన్నట్టు శనివారం ఓ నివేదిక విడుదల చేసింది. భారత్‌లోని లిస్టెడ్ కంపెనీలన్నింటిని అజమాయిషీ చేసే అత్యున్నత పర్యవేక్షణ సంస్థ సెబీ. ఇప్పుడు ఆ సంస్థ అధిపతే అక్రమాలుక తెరలేపారని నివేదిక బయటకు రావటం సంచలనంగా మారింది.
నివేదికలో ఏముంది?
- మారిషస్ కేంద్రంగా ఐపీఈ ప్లస్ ఫండ్ అనే చిన్న ఆఫ్‌షోర్ సంస్థ పనిచేస్తున్నది. దీనిని ఏర్పాటుచేసింది అదానీ గ్రూప్‌లోని ఓ డైరెక్టర్. ఇండియా ఇన్‌ఫోలైన్ అనే వెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీ ద్వారా దీనిని ఏర్పాటుచేశారు. ఈ అక్రమ మార్గాన్ని గౌతం అదానీ సోదరుడు వినోద్ అదానీ చక్కగా ఉపయోగించుకొని భారత మార్కెట్‌లోకి ప్రవేశించాడు. అదానీ గ్రూప్‌కు విద్యుత్తు పరికరాల విక్రయానికి సంబంధించిన నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించారు. ఈ రకంగా వేలకోట్ల డాలర్ల సొమ్ము చేతులు మారింది.
- ఈ మారిషస్ ఫండ్‌తోపాటు అనుమానాస్పద బెర్ముడా ఫండ్‌లో కూడా మధుబి పురి బుచ్, ఆమె భర్త ధోవల్ బుచ్ రహస్యంగా పెట్టుబడులు పెట్టారు. వీరు పెట్టుబడులు పెట్టిన కంపెనీలు, వినోద్ అదానీ ఉపయోగిస్తున్న షెల్ కంపెనీల చిరునామాలు ఒకటే. బుచ్ దంపతులు మొదట ఐపీఈ ప్లస్‌లో సింగపూర్ వేదికగా మొదట 2015 జూన్ 5న మొదటిసారి ఖాతా తెరిచి పెట్టుబడులు పెట్టారు.
తనకుతానే క్లీన్‌చిట్?
అదానీ గ్రూప్ షెల్ కంపెనీలను ఉపయోగించ వేలకోట్ల డాలర్ల నకిలీ ఇన్‌వాయిస్‌లతో భారీగా వ్యాపారం చేస్తున్నట్టు నమ్మించి షేర్ విలువ కృత్రిమంగా పెంచుకొన్నదని 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ రిసెర్చ్ విడుదల చేసిన నివేదిక భారత్‌ను ఓ కుదుపు కుదిపింది. గౌతమ్ అదానీ ప్రధాని మోదీకి సన్నిహితుడు కావటంతో ఈ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఈ నివేదిక దెబ్బకు అదానీ గ్రూప్ విలువ 150 బిలియన్ డాలర్లు కరిగిపోయింది. ఈ అంశంపై దర్యాప్తు చేసిన సెబీ.. అదానీ కంపెనీల్లో ఎలాంటి అవకతవకలు జరుగలేదని క్లీన్‌చిట్ ఇచ్చింది. పైగా తప్పుడు నివేదిక ఇచ్చి లాభం పొందారంటూ హిండెన్‌బర్గ్ సంస్థకే షోకాజ్ నోటీసు ఇచ్చింది. తాజాగా హిండెన్‌బర్గ్ ఏకంగా సెబీ చీఫ్‌పైనే తీవ్ర ఆరోపణలు చేయటంతో ఇది మరోసారి దేశాన్ని కుదిపేసే సూచనలు కనిపిస్తున్నాయి.




