11 August, 2026 | 1:44 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

ఐటీఐ టు ఏటీసీ

19-06-2024 12:43 AM
  • అధునాతన సాంకేతిక కేంద్రాలుగా పేరుమార్పు
  • టాటా టెక్నాలజీస్‌తో రాష్ట్రం ఒప్పందం
  • రూ.2,324.21 కోట్లతో ఐటీఐల ఆధునీకరణ
  • రానున్న పదేళ్లలో 4 లక్షల మందికి శిక్షణ

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా యువతను తీర్చిదిద్దేందుకు  ఐటీఐలను అధునాతన సాంకేతిక కేంద్రాలుగా (ఏటీసీ) మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్)తో పదేళ్లకు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే ఏటీసీలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం మల్లేపల్లి ఐటీఐలో శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని 65 ఐటీఐల్లో ఆధునిక పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా ఏటీసీల్లో యువతకు శిక్షణ ఇస్తారు.

ఇందుకోసం ఏటీసీల్లో అధునాతన సామగ్రి, సాంకేతికత ఏర్పాటు చేస్తారు. శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను టీటీఎల్ నియమిస్తుంది. ఏటీసీల్లో ఏటా 15,860 మందికి ఆరు రకాల లాంగ్ టర్మ్ కోర్సుల్లో, 31,200 మందికి 23 రకాల షార్ట్ టర్మ్ కోర్సుల్లో శిక్షణ అందిస్తారు. పదేళ్లలో రాష్ర్టంలోని ఐటీఐల్లో కేవలం 1.5 లక్షల మంది మాత్రమే శిక్షణ పొందారు. ఈ ఏటీసీలతో రానున్న పదేళ్లలో నాలుగు లక్షల మంది శిక్షణ పొందుతారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చే ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.2,324.21 కోట్లు. ఇందులో రాష్ర్ట ప్రభుత్వం వాటా రూ.307.96 కోట్లు (13.26 శాతం) కాగా టీటీఎల్ వాటా రూ.2016.25 కోట్లు (86.74శాతం)గా ఉంది.

ఏటీసీలు కేవలం వివిధ కోర్సుల్లో శిక్షణకే పరిమితం కాకుండా  నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా పని చేస్తాయి. అలాగే ఈ ఏటీసీలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు చిన్న, సూక్ష్మ, మధ్యతరహా, భారీ పరిశ్రమలకు టెక్నాలజీ హబ్‌గానూ పని చేస్తాయి. ఏటీసీల్లో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి టీటీఎల్ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. ఏటీసీలు భవిష్యత్తులో తమ సేవలను పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులకు అందజేయనున్నాయి.