48 గంటలు కేసీఆర్‌పె ఈసీ బ్యాన్

02-05-2024 01:48:26 AM

బుధవారం రాత్రి 8 గంటల నుంచి అమల్లోకి

గత నెల 5న కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ ఫిర్యాదు

కేసీఆర్ వివరణను పరిశీలించిన తర్వాత ఈసీ నిర్ణయం

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించ కుండా ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 5న సిరిసిల్లలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ వివరణ కోరటంతో కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఆ వివరణపై సంతృప్తిచెందని ఈసీ ఆయనపై 48 గంటల నిషేధం విధిస్తూ బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఈసీ ఉత్తర్వుల కాపీని ఎన్నికల అధికారులు మహబూబాబాద్‌లో రోడ్ షో ఉన్న కేసీఆర్‌కు అందించారు.

ఫిర్యాదు

సిరిసిల్ల మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్.. కాంగ్రెస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందులోని కొన్ని వాక్యాలు అవమానకరంగా ఉన్నాయని సీఈవో వికాస్‌రాజ్‌కు, జిల్లా ఎన్నికల అధికారికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులోని అంశాలు..

* బతకడానికి నిరోద్‌లు, పాపడాలు అమ్ముకోవాలని ఒక కాంగ్రెస్ వ్యక్తి అంటాడు.. ఇలా అంటున్నవాళ్లు కుక్కల కొడుకులా?

* నీటి విలువ తెలియని లత్కోర్‌ల పాలనతోనే ఇలాంటి పరిస్థితి తలెత్తింది. చేతకాని చవట దద్దమ్మలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు.

* మీ ప్రభుత్వం లత్కోర్ ప్రభుత్వం.. అబద్ధాలు చెప్పి కేవలం 1.8 శాతం ఓట్ల శాతంతో గెలుపొందారు.

* దీనిర్థం.. మీరు పక్కా చవటలు, దద్దమ్మలు, చేతకాని చవటలు (యూ ఆర్ యూజ్‌లెస్ ఫెలోస్)

* రెండోది.. మీరు రూ. 500 బోనస్ ఇవ్వకపోతే మీ గొంతు కొరికిచంపుతాం.

వివరణ

ఈసీ షోకాజ్ నోటీసుకు కేసీఆర్ ఏప్రిల్ 23న వివరణ ఇచ్చారు. ‘తెలంగాణకు, సిరిసిల్లకు ఎన్నికల అధికారులుగా ఉన్నవారికి తెలంగాణ మాండలికం సరిగా అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ  పూర్తి ప్రెస్‌మీట్ కాకుండా అందులోని కొన్ని వాక్యాలనే పేర్కొంది. నా వ్యాఖ్యలను ఇంగ్లిష్‌లోకి తప్పుగా తర్జుమా చేశారు. వక్రీకరించారు’ అని తెలిపారు.

గుడ్లు పీకుత అన్న సీఎంపై చర్యలేవి?

ఈసీ ఆదేశాలపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

హైదరాబాద్, మే1 (విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దేశ ప్రధాని నరేంద్రమోదీ ఎన్నిసార్లు విద్వేష వ్యాఖ్యలు చేసినా పట్టించుకోని ఎన్నికల సంఘం.. తనపై నిషేధం విధించటం దారుణమని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా 48 గంటలపాటు నిషేధం విధించటంపై కేసీఆర్ స్పందించారు. రాష్ట్ర సీఎం ‘నీ పేగులు తీసి మెడకు వేసుకుంట.. నీ గుడ్లు పీకుతా’ అంటే ఏం చర్యలు తీసుకోని ఈసీ తన ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించిందని ఆరోపించారు. ఎన్నికల అధికారులు తన మాటలను సరిగా అర్థం చేసుకోలేదని అన్నారు. స్థానిక మాండలికం వారికి అర్థం కాలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు తన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకుని ఈసీకి ఫిర్యాదు చేశారని, వాటిని ఇంగ్లిష్‌లోకి అనువదించటం సరికాదని పేర్కొన్నారు.  

మోదీ విద్వేషం ఈసీకి వినిపించలేదా?: కేటీఆర్ 

ప్రధాని మోదీ నిత్యం చేస్తున్న విద్వేష ప్రసంగాలు ఎన్నికల కమిషన్‌కు వినిపించడంలేదా? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఏకంగా తెలంగాణ కీ అవాజ్ కేసీఆర్ గొంతుపైనే నిషేధమా? అని ఎక్స్ వేదికగా అగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ బూతులు ఈసీకి ప్రవచనాల్లా అనిపించాయా? అని మండిపడ్డారు. కేసీఆర్ ప్రచారంపై నిషేధం వెనుక బడే భాయ్, చోటే భాయ్ కుట్ర ఉందని ఆరోపించారు. ప్రచారం నిలిపివేస్తే ఇంకా ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని తెలిపారు. ఈ నిషేధంతో కాంగ్రెస్, బీజేపీ దొంగ రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమయ్యాయని పేర్కొన్నారు. ఉద్యమ గొంతుక అయిన మన్నె క్రిశాంక్‌ను అరెస్టు చేయడం అక్రమం అని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కక్ష సాధింపులకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ‘నీ పేగులు తీసి మెడలో వేసుకుంటా. నీ గుడ్లు పీకుతా’ అన్న రేవంత్ వ్యాఖ్యలపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

ప్రజల గుండెల నుంచి కేసీఆర్‌ను వేరుచేయలేరు: హరీశ్

ఎన్నికల ప్రచారం చేయకుండా కేసీఆర్‌పై నిషేధం విధించినంత మాత్రాన.. ఆయనను తెలంగాణ ప్రజల గుండెల నుంచి వేరుచేయలేరని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ప్రధాని మోదీ మత విద్వేషాలు రెచ్చగొడితే ఈసీకి కనిపించదని, సీఎం రేవంత్‌రెడ్డి బూతులు మాట్లాడినా ఈసీరి వినిపించదని విమర్శించారు. కేసీఆర్ ప్రశ్నిస్తే మాత్రం ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

కేసీఆర్ ప్రజాదరణ చూసి ఓర్వలేకనే..

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ 48 గంటలపాటు నిషేధం విధించడం అప్రజాస్వామికమని బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. కేసీఆర్ బస్సుయాత్రకు ప్రజల్లో వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్, బీజేపీకి వెన్నులో వణుకు పుడుతున్నదని అన్నారు. ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, ఓటమి భయంతోనే ఈసీకి ఫిర్యాదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజల గొంతు నొక్కడమేనని ధ్వజమెత్తారు. రెండురోజుల ప్రచారం అగినంత మాత్రాన తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని స్పష్టంచేశారు.