బీజేపీని గెలిపించకుంటే రజాకార్ల పాలనే

02-05-2024 01:50:32 AM

హిందువులు, ముస్లింలు ధైర్యంగా బీజేపీకి ఓటు వేయాలి

బీజేపీకి 400 సీట్లిచ్చి మూడోసారి మోదీని ప్రధానిని చేయాలి

ఓల్డ్‌సిటీలో నిర్వహించిన రోడ్ షోలో కేంద్ర మంత్రి అమిత్ షా

చాంద్రాయణగుట్ట, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): హైదరాబాద్ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి మాధవీలతను గెలిపిస్తే రజాకార్ల పాలన నుంచి విముక్తి లభిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్‌లో గత 40 ఏండ్లుగా బీజేపీ అభ్యర్థిని గెలిపించలేదని, ప్రస్తుత ఎన్నికలలో హిందువులు, ముస్లింలు ధైర్యంగా బీజేపీకి ఓటు వేయాలని కోరారు. బుధవారం రాత్రి లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా, అనంతరం మాధవీలతకు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాధవీలతతో కలిసి ర్యాలీగా లాల్‌దర్వాజ మోడ్ సమీపంలో గ్రంథాలయం వరకు చేరుకున్న ఆయన మాట్లాడుతూ.. బీజేపీని 400 స్థానాల్లో గెలిపించాలని కోరారు.

నరేంద్రమోదీని మూడోసారి ప్రధానిని చేయాలని విజ్ఞప్తిచేశారు. హైదరాబాద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని, లేని పక్షంలో రజాకార్ల ప్రతినిధి పార్లమెంట్‌లో కూర్చుంటాడన్నారు. హైదరాబాద్ వాసులపై చేయి వేసే ధైర్యం ఏవరికీ లేదని తెలిపారు. ఎన్నికల ప్రచార సమయం ముగియడంతో అమిత్‌షా వెంటనే తన స్పీచ్‌ను నిలిపివేశారు. అమిత్‌షా ప్రసంగం ముగిసిన వెంటనే ఒకరిద్దరు చిన్నారులు స్టేజీ పైకి వచ్చారు. ఈ సారి బీజేపీకి నాలుగు వందల సీట్లు ఇద్దాం అనే నినాదంతో కూడిన బ్యానర్ చిన్నారుల చేతిలో ఉండటం చూసిన అమిత్ షా వారిని సంతోషంగా పలకరించి ఫొటోలు దిగారు.

ర్యాలీలో ప్రత్యక్షమైన రాజాసింగ్

బీజేపీ అధిష్ఠానం హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా మాధవీలతను ప్రకటించిన తరువాత పత్తాలేని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. అమిత్‌షా రోడ్ షోలో ప్రత్యక్షమయ్యారు. మాధవీలతతో కలిసి జై శ్రీరాం నినాదాలు చేశారు. ఇన్నాళ్లు మాధవీలతతో అంటీముట్టనట్టుగా ఉన్న ఆయన.. స్టేజీపైన కనిపించడంతో రాజాసింగ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. మాధవీలత రాజాసింగ్ చేయి పట్టుకొని రాజాభాయ్ అంటూ అప్యాయంగా చేతులు పైకెత్తారు.