calender_icon.png 24 November, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దశాబ్దాల కల.. తీరేది ఎలా?

24-11-2025 12:00:00 AM

  1. మిర్యాలకు బీటీ రోడ్డు కోసం నిరీక్షణ

దశాబ్దాలుగా గ్రామస్థులకు ఇరుకు రోడ్లే ఆధారం 

దారంతా కంపచెట్లతో మూసుకుపోయిన వైనం 

చినుకు పడితే ప్రయాణం నరకమే..

నూతనకల్, నవంబర్ 23 :  ప్రజల రవాణా అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వాలు ఏవైనా రవాణా మార్గాలు ఏర్పాటు చేస్తుంటాయి. దీనిలో భాగంగానే మారుమూల పల్లెలకు వెళ్లేందుకు ఉన్న డొంకదారులను సైతం ప్రజల సౌకర్యార్థం మట్టి రోడ్లుగా మార్చారు. తదుపరి పెరిగిన ప్రజల ప్రయోజనాల దృష్ట్యా వాటిని బీటీ రోడ్లుగా మార్చాలనే బాధ్యతను గత ప్రభుత్వాలు విస్మరించాయి.

ఇటువంటి పరిస్థితి మండలంలోని మిర్యాల గ్రామాన్ని సైతం ఆవహించింది.  మండల కేంద్రానికి సమీపంలో ఉన్న మిర్యాల గ్రామస్తులు రోడ్డు మార్గం సక్రమంగా లేకపోవడంతో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. మండల కేంద్రం నుంచి మిర్యాల గ్రామానికి వెళ్లాలంటే చిన్ననేమీల క్రాస్ రోడ్డు, ఎర్రపహడ్ గ్రామాల మీదుగా వెళ్లడం ద్వారా 14 కిలోమీటర్ల దూరం వస్తుంది.

ఈ బీటీ రోడ్డు వేయడం ద్వారా సుమారు పది కిలోమీటర్ల దూరం తగ్గి, కేవలం నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తే మండల కేంద్రానికి చెరుకోవొచ్చు .మిర్యాల  గ్రామంలో ప్రతి ఆదివారం సంత సాగుతుండడంతో నూతనకల్ మండల కేంద్రంతో పాటు ఆత్మకూర్ ఎస్, అర్వపల్లి, తుంగతుర్తి మండలాలకు చెందిన ప్రజలు ఈ రోడ్డు నుంచె సంతకు వెళుతుంటారు.

రోడ్డు మొత్తం  కంకర తేలి, కంపచెట్లతో మూసుకుపోవడంతో నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన మెడల్ రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మెటల్ రోడ్డును బీటీ రోడ్డు గా మార్చి  అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

బీటీ రోడ్డుగా మార్చాలి 

మా ఊరి మెటల్ రోడ్డును మరమ్మత్తులతో సరిపెడుతున్నారు. అలా గాకుండా దాన్ని బీటీ రోడ్డుగా మార్చాలి. మారిస్తే మా గ్రామంతో పాటు ఇతర గ్రామాల నుంచి సంతకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయి.

- వేల్పుల కిరణ్ , రైతు మిర్యాల

 చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది 

మండల కేంద్రం నుంచి మా గ్రామానికి చేరుకోవాలంటే చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది.మా గ్రామం నుండి నేరుగా మండలానికి రోడ్డు వేయడం ద్వారా 10 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. కొన్ని సందర్భాలలో  రైతులు పాముకాటుకు గురై మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చుట్టూ తిరిగి వెళ్లడం ద్వారా సమయం ఎక్కువ పట్టడంతో మరణించిన ఘటనలు ఉన్నాయి.ఇకనైనా బీటీ రోడ్డును వేసి మమ్మల్ని ఆదుకోవాలి.

- గుణగంటి వెంకన్న, రైతు,మిర్యాల