26-05-2025 12:39:41 AM
చివ్వెంల, మే 2౫: బీడు భూముల్లో పంటసిరులు కురిపించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేసి సాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేసి తదనగుణంగా కాలువలను తవ్విస్తే ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ప్రభుత్వం ఎంత తోడ్పాటు అందించిన రైతన్న పంట చేను వరకు సాగునీరు సవ్యంగా వెళ్లకపోవడంతో గంపెడు ఆశలతో సాగు చేసిన పంట చేతికి రాకముందే ఎండి రైతన్న అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నాడు.
ఎస్సారెస్పీ నీటి కోసం మండలంలో తవ్విన కాలువల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో కాలువనంత కంపచెట్లు, చెత్తాచెదారంతో నిండిపోయి నీటి ప్రవాహానికి ఆటంకంగా నిలిచిపోయాయి. దీంతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు సాగునీటి కోసం అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మండలంలోని లక్ష్మీ నాయక్ తండ గ్రామంలో గల శ్రీరామ్ సాగర్ కాలువ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.
కాలువ నిండా చెట్లు,చెత్త, చెదారం తో నిండి సాగునీరు సరిగా రాక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని వలన గత యాసంగి సీజన్లో నీరు సరిగా అందక వ్యవసాయ పొలాలు చేతికందే సమయంలో వందల ఎకరాల్లో ఎండిపోయి రైతులు పూర్తిగా నష్టపోవాల్సి వచ్చింది. మండల వ్యాప్తంగా శ్రీరామ్ సాగర్ కాలువ ద్వారా సుమారు 14000 ఎకరాలు సాగు చేయబడుతుంది.
అలాగే కాల్వల ద్వారా వచ్చే నీరు చెరువులు, కుంటలు ఎప్పుడూ నిండుకుండలా కనిపించేవి. బోర్లు, బావుల కింద సాగుచేసిన పొలాలకు సైతం ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కావు. కానీ ఇప్పుడు నీరు రాక చెరువులు, కుంటలు ఎండి భూగర్భ జలాలు పడిపోయి బోర్లు బావులు సైతం ఒట్టిపోయాయి.
చేసేదేమీ లేక రైతులు దీన స్థితిలో ఊరకుండిపోయారు. పూర్తిగా ఎండిన కాల్వ చివర భూములు : గత యాసంగి సీజన్లో ఎస్సారెస్పీ కింద సాగుచేసిన పంట పొలాలు ఎండకుండా ప్రభుత్వం నీటిని విడుదల చేసినప్పటికీ కాలువలు సక్రమంగా లేని కారణంగా ప్రారంభంలో ఉన్న భూములు మాత్రమే పారాయి. ప్రభుత్వం ఎన్ని తడులు ఇచ్చినప్పటికీ చివరి భూములకు నీరు అందకపోవడంతో ఆ భూములు పూర్తిగా ఎండి రైతులు నష్టపోవాల్సి వచ్చింది.
అస్తవ్యస్తంగా పిల్ల కాల్వలు
పెద్ద కాలువ పరిస్థితి ఇలా ఉంటే వాటి పిల్ల కాలువల పరిస్థితి ఇంకా అస్తవ్యస్తంగా ఉన్నాయి, పిల్ల కాలువల పూడికలు తీయక నీరు పారుదల సరిగా జరగడం లేదు. దీంతో పంటలు ఎండడంతో పాటు, చెరువులకు, కుంటలకు నీరు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.
ఈసారైనా సాగు సాగేనా?
గతంలో కాలువలు సక్రమంగా లేని కారణంగా టేలాండ్ భూములు ఎండిపోవడం తో ఈసారి అధికారులు ముందస్తు చర్యలు తీసుకుని కాలువలను శుభ్రం చేస్తే సాగునీటికి కష్టాలు ఉండవని రైతుల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు కాలువలను శుభ్రం చేయించి సాగునీటి మార్గానికి ఆటంకాలు తొలగిస్తే సాగునీటికి ఇబ్బందులు ఉండవంటున్నారు. అయితే సంబంధిత అధికారులు ఈసారైనా సాగు సవ్యంగా సాగేలా చేస్తారా అని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సాగునీటికి అడ్డంకులు లేకుండా చూడాలి
శ్రీరామ్ సాగర్ కాలువ నిండా కంప చెట్లు, చెత్తాచెదారంలు ఉండటం వలన నీరు పారుదల సరిగా జరగక మాకు గత యాసంగిలో పంట పొలాలు ఎండిపోయాయి. అధికారులు కాల్వలలో ఉన్న అడ్డంకులను తొలగించి ఉంటే కొంత నష్టం తగ్గేది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెట్లు, చెత్తాచెదారం తొలగింపజేసి, పూడిక తీయించి సాగు నీటి పారుదలకు అడ్డంకులు లేకుండా చేయాలి.
లింగ నాయక్, రైతు, బాధ్యతండ, చివ్వెంల మండలం