20 April, 2026 | 2:38 AM

కాసు బాగు భూములకు ప్రైవేట్ వ్యక్తులు కంచె ఎలా వేస్తారు?

20-04-2026 12:41 AM

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపాటు

బడంగ్పేట్, ఏప్రిల్ 19(విజయక్రాంతి) : మహేశ్వరం నియోజకవర్గం నాదర్గుల్లోని కాసు బాగు (శివరాజ్ బహదూర్) భూములను ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకోవడంపై మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సర్వే నెంబర్ 613 (119)లో ఉన్న 373 ఎకరాల ప్రభుత్వ భూమికి ప్రైవేట్ వ్యక్తులు రేకుల కంచె ఎలా వేస్తారని ఆమె నిలదీశారు.

ఆదివారం నాదర్గుల్లో పర్యటించిన ఆమె భూ బాధితులను పరామర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఈ భూముల అంశం చర్చకు రాగా, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీటిని స్పష్టంగా ప్రభుత్వ భూములుగా ప్రకటించారని గుర్తు చేశారు. హైకోర్టు సింగిల్ బెంచ్ మరియు డబుల్ బెంచ్ కూడా ఈ భూములు ప్రభుత్వానివేనని స్పష్టం చేశాయని, ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ ప్రైవేట్ వ్యక్తులు కంచెలు వేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నాయకుల అండతోనే భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారని, అధికారంలోకి వచ్చిన నాటి నుండి దోపిడీలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దాదాపు 600 కుటుంబాలకు చెందిన రైతులు ఈ 373 ఎకరాలపై ఆధారపడి జీవిస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.ప్రతి కుటుంబం 1 నుండి 3 ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్నారని, ఇప్పుడు వారిని భూముల్లోకి వెళ్లనివ్వకుండా సెక్యూరిటీని పెట్టి అడ్డుకోవడం అన్యాయమని ధ్వజమెత్తారు.

పొలాల్లో ఎండిపోయిన పంటలను, గతంలో సాగు కోసం వాడిన బోర్లను, కుంటలను ఆమె స్వయంగా పరిశీలించారు.మంత్రులు, కలెక్టర్ సైతం ఇవి ప్రభుత్వ భూములేనని చెబుతున్నా, కబ్జాదారులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న మతలబు ఏంటని ఆమె ప్రశ్నించారు.ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అయితే వెంటనే స్పందించి, అక్రమంగా వేసిన రేకులను తొలగించాలి.

రైతులకు న్యాయం జరిగే వరకు బిఆర్‌ఎస్ పార్టీ తరపున తమ పోరాటం ఆపేది లేదని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో నాదర్గుల్ బిఆర్‌ఎస్ నాయకులు సుదర్శన్ రెడ్డి, జగన్ రెడ్డి, జంగయ్య, కుమార్ గౌడ్, నరసింహారెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, భూ బాధితులు పాల్గొన్నారు.