పెట్టుబడుల పేరుతో భారీ మోసం
- రూ. 36 లక్షలు దోచిన మోసగాళ్లు
సైబర్ నేరగాళ్ల గుట్టురట్టు చేసిన మల్కాజిగిరి కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులు
వివరాలు వెల్లడించిన సైబర్ క్రైమ్ డీసీపీ నాగలక్ష్మి
ఎల్బీనగర్, ఏప్రిల్ 1 : అమాయకులకు అధిక లాభాల ఆశచూపి నిలువు దోపిడీ చేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠా ను మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా కేంద్రంగా నడుస్తున్న ఒక నకిలీ కాల్ సెంట్ప దాడి చేసి ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. డీసీపీ నాగలక్ష్మి బుధవారం ఎల్బీనగర్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే.. నాగోల్ ప్రాంతానికి చెందిన గుర్రం నవీన్ చందర్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నానని, ఫిబ్రవరి 18న తాను సైబర్ మోసానికి గురయ్యానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాట్సాప్లోని ‘బార్ క్లేస్’ అనే గ్రూప్ ద్వారా పరిచయమైన కేటుగాళ్లు ఒక నకిలీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో బాధితుడికి ఏకంగా రూ. 7 కోట్ల లాభం వచ్చినట్లు నకిలీ స్క్రీన్ షాట్లు చూపించి నమ్మబలికారు.
ఇది నిజమని నమ్మిన బాధితుడు విడతల వారీగా రూ. 36,35,010 పెట్టుబడి పెట్టారు. కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే బాధితుడికి తిరిగి ఇచ్చి మిగిలిన మొత్తం లాగేసుకుని మోసం చేశారు. బాధితుడు తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయిం చారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, డిసిపి ఎస్ వి నాగలక్ష్మి పర్యవేక్షణలో ఇన్స్ పెక్టర్ జి. సుధాకర్ నేతృత్వంలోని బృందం సాంకేతిక ఆధారాల సాయంతో దర్యాప్తు చేపట్టగా మొత్తం 8 ఖా తాలకు బాధితుడు విడతల వారీగా డబ్బు లు బదిలీ చేసాడు.
ముందుగా బదిలీ చేసిన ఖాతాను పోలీసులు గుర్తించి విచారణ చేయగా నిందితులు పశ్చిమగోదావరి జిల్లా పెద్దమీరం గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. విచారణ సమయంలో మొత్తం 8 మంది నిందితులున్నట్లు తేల్చారు. అయితే ముం దుగా బదిలీ చేసిన ఖాతాపై దేశంలోని 10 రాష్ట్రాలలో కేసులు నమోదైనట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలీసుల సాయంతో దాడులు నిర్వహించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారి వద్ద నుండి 45 మొబైల్ ఫోన్లు, ఒక లాప్టాప్, 3 రూటర్లు, 2 ట్యాబ్లు, 22 చెక్ బుక్కులు, 40 ఏటీఎం కార్డులు, 20 సిమ్ కార్డులు, పలు ఆధార్, పాన్ కార్డులు భారీగా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.




