28 March, 2026 | 2:58 AM

జీహెచ్‌ఎంసీ పరిధిలో అసెంబ్లీ స్థానాలు భారీగా పెరుగుదల!

28-03-2026 01:05 AM
  1. 20 స్థానాల వరకు పెరిగే అవకాశం

రాష్ట్రవ్యాప్తంగా 60 స్థానాలు పెరిగే అవకాశం

2011 జనాభా ఆధారంగా పెరగనున్న అసెంబ్లీ స్థానాలు

మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్న జిల్లాల్లో కనీసం ఒకట్రెండు సీట్లు పెరిగే చాన్స్

హైదరాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా 2029లో జమిలి ఎన్నికలు జరగనుండటంతో.. ఈలోపుగానే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఉన్న అసెంబ్లీ స్థానాలను మరో 50 శాతం పెంచుతామని, అలాగే లోక్‌సభ స్థానాలనుకూడా 50 శాతం పెంచుతామని కేంద్రం స్పష్టత ఇవ్వడంతో.. తెలంగాణలో పెరిగే అసెంబ్లీ స్థానాలపై చర్చ మొదలయ్యింది. ఇప్పటికే చాలా మంది నేతలు..

ఔత్సాహికులు జనాభా గణాంకాలను ముందరేసుకుని లెక్కలు కూడుతున్నారు. జనాభా ఆధారంగా అసెంబ్లీ స్థానాలను పునర్విభజన చేస్తారనే వినపడుతున్న నేపథ్యంలో.. ఏయే జిల్లాల్లో పెరిగే అవకాశం ఉంది.. ఎన్ని పెరిగే అవకాశం ఉంది.. ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందనే అంచనాల్లో నేతలు తలమునకలయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన అనేది 2011 జనాభా లెక్కల ఆధారంగానే జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టంచేశారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 2011 నాటి జనాభా గణాంకాలను నేతలు బట్టీ పడుతున్నారు. రాష్ట్ర విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. 33 జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీలు, 32 జిల్లా పరిషత్‌లు, 540 మండల పరిషత్‌లు, 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 612 రెవెన్యూ మండలాలు ఉండగా.. రాష్ట్ర మొ త్తం జనాభా (2011 సెన్సస్ ప్రకారం) 350.04 లక్షలు. ఇందులో గ్రామీణ జనాభా 213.95 లక్షలు, పట్టణ జనా భా 136.09 లక్షలుగా ఉంది.

సగటున 2 లక్షల జనాభాతో..

రాష్ట్రంలో ప్రస్తుతం 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మరో 50 శాతం అంటే.. 60 వరకు నియో జకవర్గాలు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దానిని బట్టి అర్థమవుతోంది. అంటే 119 స్థానంలో అసెంబ్లీ స్థానాలు కాస్తా.. 179కి చేరుకుంటాయని అంచనా. ఈ లెక్కన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. సగటున 2 లక్షల జనాభాకు ఒక నియోజకవర్గం ఉండే అవకాశం ఉంటుందని అధికారులుకూడా అంచ నా వేస్తున్నారు.

ఇప్పుడున్న నియోకవర్గాల్లో పూర్తిస్థాయిలో మార్పులు వస్తాయని నేతలుకూడా అంచనాల్లో మునిగితేలుతున్నారు. 179 స్థానాలలో 2 లక్షల జనాభా చొప్పున గణించుకున్నా.. 3.50 కోట్లకు అటూ.. ఇటూగా అవుతుంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో 2 లక్షలకుపైగా ఉండవచ్చు. మరికొన్ని నియోజకవర్గాల్లో 2 లక్షల లోపే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. ఆయా ప్రాంతాలను చేర్చడం, తీసివేయడం ద్వారా.. జనాభా అనేది కాస్త పెరగడానికి, తగ్గడానికి అవకాశం ఉంటుందనే చెప్పవచ్చు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా..

రాష్ట్రంలో మొత్తం 3.5 కోట్ల జనాభా (2011 సెన్సస్ ప్రకారం) ఉండగా.. ఇందులో ఒక కోటికిపైగా జనాభా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ పూర్తి జిల్లాలో సుమారు 40లక్షల జనాభా ఉంది. అలాగే .. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి లాంటి జిల్లాల్లో కొద్ది భాగం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉంది. ఓఆర్‌ఆర్ వరకు చూసుకుంటే.. ఒక కోటి వరకు జనాభాతో ఉంది. 

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 27 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తాజా అంచనాలతో ఇవికాస్తా.. 50 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ లెక్కన చూసుకున్నా.. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న కోటి మందికిపైగా ఉన్న జనాభాను సగటున 2 లక్షల చొప్పున చూసుకున్నా.. 50 వరకు నియోజకవర్గాలు ఉంటాయని నేతలు లెక్కిస్తున్నారు. మేడ్చల్ మల్కా జిగిరి జిల్లాలో దాదాపు 24.5 లక్షల జనాభా ఉంది.

ఈ జిల్లాలోనూ గణనీయంగా నియోజకవర్గాలు పెరిగే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. అత్యధికంగా ఓటర్లు ఉన్న శేరిలింగంపల్లి కాస్తా.. రెండు నియోజకవర్గాలు అయ్యేఅవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అలాగే ఉప్పల్, మల్కాజిగిరి లాంటి నియోజకవర్గాలు కూడా రెండేసి చొప్పున అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు.  

గ్రామీణ తెలంగాణలో.. 

ఇక మిగతా రాష్ట్రం విషయానికి వస్తే.. జనాభా ఆధారంగా చూసుకున్నా.. ప్రతి జిల్లాలోనూ ఒకటి నుంచి రెండు నియోకవర్గాలు తప్పనిసరిగా పెరిగే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఉదాహరణకు ఆదిలాబాద్‌నే తీసుకుంటే.. ఆదిలాబాద్ జనాభా చూసుకుంటే 7 లక్షలకంటే ఎక్కువగా ఉంది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో కేవలం రెండే రెండు నియోజకవర్గాలు ఆదిలాబాద్, బోథ్ ఉన్నాయి.

కొంత ప్రాంతం.. ఖానాపూర్ నియోజకవర్గం (నిర్మల్ జిల్లా) కింద ఉంది. ఈ నేపథ్యంలో సగటున 2 లక్షల జనాభాను పరిగణనలోకి తీసుకున్నా.. ఉట్నూర్ లేక గుడిహత్నూర్ కేంద్రంగా మరో నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. జగిత్యాల జిల్లా తీసుకుంటే.. మొత్తం జనాభా దాదాపు 10 లక్షల వరకు ఉంది. ఈ జిల్లాలో ప్రస్తుతం ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి.

జనాభా ప్రకారం చూసుకుంటే.. మరో రెండు నియోజకవర్గాలు రావాలి. అయితే గతంలో మెట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఉండేది. దానిని కోరుట్ల నియోజకవర్గంగా మార్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల ప్రాంతాలు, జనాభాను విభజించి.. కొత్తగా మెట్‌పల్లి నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశం స్పష్టంగా కనపడుతోంది.

అవకాశం ఉంటే.. ఇటు నిజామాబాద్ జిల్లా, అటు సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి జిల్లాల్లో కొత్తగా నియోజకవర్గాలను ఏర్పాటుచేయడానికి, లేదా ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రాంతాలను కొత్త నియోజకవర్గాల్లో కలిపే అవకాశంకూడా కనపడుతోందని నేతలు లెక్కలు వేస్తున్నారు. 

హన్మకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్‌నగర్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మెదక్ లాంటి జిల్లాల్లో కచ్చితంగా ఒకటి లేదా.. రెండు నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, వరంగల్ లాంటి మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్న ప్రాంతాల్లో జనాభా ఆధారంగా.. ఒకటి లేదా రెండు నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందని గణాంకాలతో నేతుల కుస్తీలు పడుతున్నారు.

మొత్తానికి 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే.. రాష్ట్రం మొత్తంపై దాదాపు అన్ని జిల్లాల్లోనూ సగటున ఒక్కో నియోజకవర్గం పెరిగే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. కొన్నిచోట్ల 2 సెగ్మెంట్లు కొత్తగా ఏర్పడవచ్చు. అయితే కేంద్రం చట్టం చేసిన తరువాత..  ప్రతి నియోజకవర్గం కచ్చితంగా ఒకే జిల్లాలో ఉండాలనేది ప్రాతిపదికన తీసుకుంటే.. ఇందులో కొంత మార్పు ఉండవచ్చు.

అయితే గరిష్టంగా మాత్రం.. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి లాంటి జీహెచ్‌ఎంసీ పరిధిలోని జిల్లాల్లో అత్యధికంగా నియోజకవర్గాలు పెరిగే అవకాశమే ఎక్కువగా కనపడుతోంది. సీట్లు పెరగడం ఆశావహులకు, ఔత్సాహికులకు సంతోషం కలిగించే విషయమే అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు తమ పరిధిలో.. ఏ ప్రాంతాలు ఉంటాయి.. ఏ ప్రాంతాలు పోతాయి.. తమ పరిధి ఎక్కడివరకు ఉంటుందనే లెక్కల్లో నిమగ్నమయ్యారు.