భారీగా పెరిగిన వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు
ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఆదాయాల వృద్ధిని సూచిస్తూ ఆ పన్నుల నికర వసూళ్లు భారీగా 25.23 శాతం పెరిగి రూ.10.44 లక్షల కోట్లకు చేరాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.8.33 లక్షల కోట్ల వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు నమోదయ్యాయి. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌తో పాటు స్థూల వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 24.26 శాతం వృద్ధిచెంది రూ.9.67 లక్షల కోట్ల నుంచి రూ.12.01 లక్షల కోట్లకు పెరిగాయి. 2023 వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రూ.3.79 లక్షల కోట్ల రిఫండ్స్ జారీచేసినట్టు సీబీడీటీ తెలిపింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు 13.06 శాతం వృద్ధితో రూ.10 లక్షల కోట్ల నుంచి రూ.11.32 లక్షల కోట్లకు పెరిగాయి.
నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు 10.26 శాతం పెరిగి రూ.8.26 లక్షల కోట్ల నుంచి రూ.9.11 లక్షల కోట్లకు చేరాయి. పరోక్ష పన్నులు సైతం బడ్జెట్ అంచనాలు రూ.14.84 లక్షల కోట్లను మించి భారీగా పెరిగినట్టు ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెక్స్ (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ ఒక లేఖలో ఫీల్డ్ ఆఫీసర్లకు వెల్లడించారు. పరోక్ష పన్నులు పెరుగుదలకు ప్రధాన కారణం జీఎస్టీ వసూళ్లు రికార్డుస్థాయిలో జరగడం కారణమని తెలిపారు. కస్టమ్స్, కేంద్ర ఎక్సేయిజ్ సుంకాలు కూడా పరోక్ష పన్నుల్లో కలిసి ఉంటాయి.






