మానవత ‘మరచిపోకుమా !’
సురేంద్ర రొడ్డ,కవి :
ఒక మంచి కవిత మనసులోపలి పొరల్ని తాకాలి. గొప్ప కవిత్వం మనిషిని ఆలోచింపజేయాలి. అలాంటి కవిత్వం మాత్రమే మన వెంట నడుస్తాయి. వాటిలోని భావాలు, ప్రశ్నలు, ఆవేదనలు, సందేశాలు మన అంతరంగంలో నిత్యం ప్రతిధ్వనిస్తూ ఉంటా యి. అలాంటి అరుదైన అనుభూతిని కలిగించిన కవితా సంపుటి కవి సురేంద్ర రొడ్డ ‘మరచిపోకుమా’. ‘వాన వెలిశాక నడక మొదలు పెట్టా ను.. దారి పొడుగునా చెట్లు చిరుగాలికి ఊగుతూ చినుకులు రాలుస్తూ లిపిలేని బాసలో ఏవో గుస గుసగా ఊసులు అనువదిస్తే అనిపించింది.
అమ్మచేతి ప్రేమాభిషేకమని అమ్మపాడిన లాలి పాటని..’ అంటూ కవి సంకలనం ఆరంభంలోనే ప్రకృతి భాషను ‘అనువదిస్తే’ అనే కవితతో మనకు నేర్పుతారు. ‘తను విడిచి వెళ్లినే చోటునే ప్రతిరోజూ చూస్తున్నా. తను రాలేదు.. ఎంత నిలువరించుకున్నా కాసిన్ని కన్నీటి చుక్కలు రాలాయి’ అంటారు ‘తనతో సాహితీ పవనం’ కవితలో.
ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి వృత్తిగత, బాహ్యా ప్రపంచపు విషయాలను గుర్తుంచుకుంటున్నాడే గానీ, మానవ బంధాలను, విలువలను, బాధ్యతలను క్రమక్రమంగా మరచిపోతున్నాడనే ఆవేదనతో కవి ఈ సంకలనాన్ని వెలువరించారు. మనిషిలోని మనిషిని మేల్కొల్పే ప్రయత్నమే సంపుటి ప్రధాన ఉద్దేశంలా అనిపించింది. సంకలనంలోని ప్రతి కవిత ఒక భావజీవి హృదయం నుం చి జాలువారిన అనుభూతిలా అనిపిస్తుంది. సురేంద్ర కవిత్వంలో ఎక్కడా ఆర్భాటం లేదు.
అర్థంకాని పదజాలం లేదు. అత్యంత సరళమైన భాషలో లోతైన జీవిత సత్యాలను ఆవిష్కరించారు.ఈ కవితలు చదవడానికి మాత్రమే కాదు, మననం చేసుకోవడానికీ అనువుగా ఉన్నాయి. చదవిన ప్రతి పాఠకుడికి జీవితం పట్ల ఆశావహ దృక్పథాన్ని అందించేలా సంకలనం ఉంది. నీలా నీవు బతకలేవు కవితలో మనిషి వ్యక్తిత్వానికి అద్దం పడితే, అంకితం కవితలో మనిషి మనిషికి తోడుగా ఉండాల్సిన అవసరాన్ని స్పృ శించారు.
‘జననం మరణం మన చేతుల్లో లేదు.. కానీ నడుమ జీవితం మాత్రం మనచేతుల్లోనే.. ఆనందమైనా విషాదమైనా విధాతరాత కు మించి నీ జీవిత పుస్తకానికి కథా రచయితవు నువ్వే’ అంటారు కవి ఒక చోట. ‘ఆమె ఓ మౌన క్షేత్రం.. అతడు చినుకై తాకాడు.. ఆమె మాటల మడుగైంది.. అతడు కిరణమైన మెరిశాడు. ఆమె హరివిల్లు మురిసింది. అతడు ఆవిరై మేఘమయ్యాడు. ఆమె ఎద ఎడారి క్షేత్రమైంది’ అంటూ మరో కవితాలో భావ కవిత అయి ఉప్పొంగారు.
ఇలా ప్రతీ కవిత ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మోస్తూ పాఠకుడిని ఆలోచనలో ముంచెత్తుతుంది. సమాజంలో రుగ్మతలపై కవి స్పందించిన తీరు ప్రశంసనీయం. రైతుల కష్టం, తల్లి ప్రేమ, మానవ సంబంధాలు, యువత బాధ్యత, దేశభక్తి, సామాజిక చైతన్యం వంటి అనేక అంశాలు కవితల్లో సహజంగా ఒదిగిపోయాయి.
కేవలం కవితలు రాయాలనే ఉద్దేశంతో కాకుండా, సమాజానికి ఏదో చెప్పాలనే తపనతో ఈ అక్షరాలు పుట్టాయని మనకీ కవితలు చదువుతుంటే అర్దం అవుతుంది. సంపుటిలో ప్రత్యేకంగా నచ్చిన అంశం. మనకి ఏదో చెప్పడానికి ప్రయత్నించలేదు. ఆలోచింపజేయడానికి ప్రయత్నించారంతే. ఆ ప్రత్యేకత ఈ పుస్తకానికి బలం. మనిషిలో మసకబారుతున్న మానవత్వాన్ని మళ్లీ వెలిగించాలనేది కవి ప్రగాఢమైన ప్రయత్నం.
వెల: 200/- పేజీలు:120
ప్రతులకు: 94915 23570
ఎన్.లహరి సమీక్షకురాలు






