‘చింత’కు సరి ఏది?
భట్టు వెంకటరావు :
తెలంగాణ ప్రాంతానికి(Telangana region) చెందిన ప్రముఖ కవుల్లో(famous poets) కొఱవి గోపరాజు(Koravi Goparaj) ఒకరు. ఈయన క్రీ.శ.14-వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన ప్రఖ్యాత రచన ‘సింహాసన ద్వాత్రింశిక’ కావ్యం తెలుగులోని ఉత్తమ కథాకావ్యాల్లో ఒకటిగా పేరుపొందింది. చరిత్రలో ప్రసిద్ధికెక్కిన విక్రమార్కుడి దివ్య సింహా సనపు మెట్లపై మలచబడి ఉన్న 32 సాలభంజికలు, భోజమహారాజుకు చెప్పిన 32 కథలు రచనలోని ముఖ్య విషయం.
అయితే, ఈ కథల్లో సందర్భానికి సరిపోయినప్పుడల్లా నాటి తెలుగువారి జీవన విధా నానికి సంబంధించిన చాలా ఆసక్తికరమైన విషయాలను, తెలుగు నుడికారపు సొంపుతో మేళవించి చెప్పాడు గోపరాజు. అలాంటి సందర్భాల్లో ఒకటి- చింతచెట్టును గురించి, చింతపండు రుచిని గురించి చెప్పిన ఏడు పద్యాలతో కూడుకున్న పద్యమాలిక. ఆ ఏడు పద్యాల్లో నాలుగింటిలో గోపరాజు ప్రదర్శించిన కవితా చమత్కృతిని వివరించడం ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.
(కం)
చింత మదిలేక మనుజులు
చింతించినకొలఁదిఁ జవులు చేకూర్చుచు ని
శ్చింతులఁగా నొనరించెడు
చింతకు సరిగలదె లోక చింతామణికిన్?
(తృతీయాశ్వాసం, 155వ పద్యం)
(చింతపండు ఉండగా) రుచికరమైన భోజనాన్ని గురించిన చింత ఏమీ లేని మనుషులు, చింతపండుతో మిళితమైన ఆహార పదార్థాలను గురించి గుర్తుచేసుకుని ఆలోచించే కొలదీ మరింతగా వారి జిహ్వలకు ఆయా ఆహార పదార్థాల రుచికి సంబంధించిన జ్ఞాపకాలు నోరూరిస్తూ వుండగా, రుచికరమైన ఆహారాన్ని గురించి భవిష్యత్తులో చింత అనేది లేకుండా చేసిన చింతపండుతో సరిపోల్చదగినరుచిని అందించే దినుసు మరొకటి ఉన్నదా? అని అతిశయోక్తిగా ప్రశ్నించడంపైనే పద్యం.
(కం)
భ్రాంతిపడి కల్పవృక్ష
ప్రాంతంబునఁ గూడుఁ గుర్కుఁ బట్టక సురల
శ్రాంతంబు దీనికై మదిఁ
జింతించుటఁ జేసి పరఁగెఁ జింత యనంగన్
(తృతీయాశ్వాసం, 157వ పద్యం)
‘చింత’ అని ఆ చెట్టుకు ఆ పేరు ఎలా వచ్చింది? అనే ప్రశ్న ను తాను వేసుకుని, ఆ ప్రశ్నకు సమాధానంగా ఒక చమత్కారం నిండిన ఊహను ముందుకు తెచ్చి చూపాడు కొఱవి గోపరాజు ఈ పద్యంలో. మహామహిమాన్వితమైన కల్పవృక్షం వారి చెంతనే ఉన్నప్పటికీ, చింతచెట్టు లేదనే బెంగతో - గూడుఁ గుర్కుఁ బట్టక - నిద్రాహారాలు మాని దేవతలందరూ చింత రుచికోసం అదేపనిగా చింతించడం వలన, ఆ చెట్టుకి ’చింత చెట్టు’ అనే పేరు వచ్చిందని చమత్కరించడంపై పద్యంలో చెప్పిన ఆసక్తికరమైన విషయం.
(కం)
మును జిగురునఁ బువ్వున నో
మనగాయల దోరపండ్ల మఱి యారఁగఁబం
డినపండ్ల నెల్లకాలముఁ
దనియఁగఁ జవు లొసఁగ నొండు తరువులు గలవే !
(తృతీయాశ్వాసం, 158వ పద్యం)
చింతచెట్టు ఆకులు, పూవులు ఏ దశలో, ఏ రూపంలో కనపడి మనిషి జిహ్వకు రుచిని కలిగిస్తాయో చెప్పబడింది ఈ పద్యంలో. మొదటగా చింత ‘చిగురుగా’ఉన్న దశలో ఆకుకూరగా ఉపయోగంలోకి వస్తుంది. చింత ‘పువ్వు’ చూడడానికి కూడా చాలా అందంగా కనపడుతుంది. అలా చెట్టునుంచి కో సుకుని ‘పువ్వుగా’ తిన్నా బాగుంటుంది. చింతకాయలు మూ డుదశలలో తినడానికి బాగుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి.
మొదటగా మరీ చిన్నవిగా ఉన్నప్పుడు, అనగా ఇంకా లోపల గింజ పట్టనప్పుడు లేలేత కాయలను కోసుకుని తినడానికి ఎందరో ఇష్టపడతారు. చిరు వగరుతోను, అప్పుడప్పుడే పట్టుతున్న చిరు పులుపు రుచితోను చాలా బాగుంటాయి. కొంచెం పెద్దవై లోపల కండపట్టి, గింజ పచ్చి పచ్చిగా, సగం తయారైన దశలో, దోరగా పుల్లగా ఉండి ఆనందాన్ని కలిగిస్తాయి. ఇలా, ఇన్ని దశ లలో జిహ్వకు ఆనందాన్ని కలిగించే చెట్టు మరొకటి ఉన్నదా? అని గొపరాజు ప్రశ్న. లేదు అనేది సమాధానం.
(ఆ.వె)
గరితలేని యిల్లు దొరలేని తగవును
జింతపండు లెని వింతచవియుఁ
జనువు లేని కొలువు శశిలేని రాత్రియు
ముక్కులేని మొగము నొక్కరూపు.
(తృతీయాశ్వాసం, 161వ పద్యం)
చివరగా, ఇల్లాలు లేని ఇల్లు, తీర్చడానికి సరైన అధికారం ఉన్న వ్యక్తి లేని తగువు, చింతపండు లేని వింత రుచి, మనసులోని మాటను ఏ జంకు లేకుండా చెప్పడానికి చనువు లేని కొలువు, చందమామ లేని రాత్రి, ముక్కు సరిగా లేని ముఖ ము... ఇవన్నీ ఒకే రకమైనవిగా - అనగా పసలేనివిగా, అందగించనివిగా తీర్మానించి చెప్పాడు కొఱవిగోపరాజు.
వ్యాసకర్త సెల్: 99591 20528






