23 April, 2026 | 1:54 AM

కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు

23-04-2026 12:37 AM

అగ్గువకే అమ్మకాలు..మక్కల కొనుగోళ్లకు అన్నదాతల అవస్థలు 

మహబూబాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈసారి యాసంగిలో పెద్ద మొత్తంలో పండించిన మక్కల అమ్మకాలకు అన్నదాతలు ఆరిగోస పడుతున్నారు. దిగుబడికి తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటు చేసిన అరకొర కేంద్రాల్లో ఇప్పటికే వేల బస్తాల మక్కలు పేరుకుపోవడం, తేమ, ఇతర సాకులతో కొర్రీలు పెడుతుండడంతో రైతులు పండించిన పంటను నిల్వ చేసుకునే పరిస్థితి లేక అగ్గువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి ఆర్థికంగా నష్టపోవలసిన పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో మక్కలకు క్వింటాల్ కు 2,400 రూపాయలు చెల్లిస్తుండగా, అక్కడ రోజుల తరబడి నిరీక్షించే పరిస్థితి లేక ప్రైవేటు వ్యాపారులకు క్వింటాలకు కనిష్టంగా 1,500 నుండి గరిష్టంగా 1,900 వరకు విక్రయించి క్వింటాలకు 400 నుండి 500 రూపాయల చొప్పున నష్టపోతున్నారు. యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా లక్షన్నరకు పైగా ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఎకరానికి తక్కువలో తక్కువ 25 క్వింటాళ్ల నుంచి 40 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వచ్చింది.

ఫలితంగా జిల్లాలో ఎక్కడ చూసినా మక్కజొన్నలే కనిపిస్తున్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా 20 కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ సంస్థ ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో విక్రయించడానికి తెచ్చిన మక్కలతో కిక్కిరిసిపోవడంతో  కొనుగోళ్లకు జాప్యం జరుగుతోంది. ఒక్కో రైతు 20 రోజుల నుండి కొనుగోలు కేంద్రాల్లో మక్కలను విక్రయించడానికి పడికాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఈ నేపథ్యంలో రోజుల తరబడి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షించలేక, సాగు చేసిన మక్క పంట నిల్వను చూసుకునే పరిస్థితి లేక, వాతావరణ మార్పుల నేపథ్యంలో ఎంతకు అంతకు అమ్మడానికి అన్నదాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా మార్క్ఫెడ్ సంస్థ ద్వారా మక్కలు విక్రయించడానికి కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన రైతులు కొనుగోళ్లకు తేమ, ఎకరానికి 25 క్వింటాళ్ల మక్కలు మాత్రమే కొంటామని,ఇతర సాకులతో కొర్రీలు పెట్టడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో అగ్గువకు ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తూ నష్టపోతున్నారు. 

ప్రైవేట్ ట్రేడర్లు ఇదే అదనుగా భావించి కనీసం మద్దతు ధరకు మక్కలు కొనకుండా, ఇష్టం ఉన్న ధరకు కొంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు, ఇటు ప్రైవేటు ట్రేడర్ల దోపిడీ వల్ల ఈ యాసంగి సీజన్లో మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులు ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యాపారులకు లాభాలు అన్నదాతకు నష్టాలు

యాసంగి సీజన్లో పండించిన మక్కజొన్న పంట వ్యాపారులకు లాభాల సిరులు కురిపిస్తుండగా, ఆరుగాలం కష్టపడి పండించిన అన్నదాతకు మద్దతు ధర లభించక నష్టాల పాలవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు మొక్కజొన్నలకు క్వింటాలకు కనిష్టంగా 1750 రూపాయలు మాత్రమే పెడుతున్నారని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి విక్రయించే పరిస్థితిలో  సిద్ధం చేసిన మక్కలకు కూడా 1900 రూపాయలకు మించి ధర పెట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అమ్మకానికి సిద్ధం చేసిన పంట నిలువ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ట్రేడర్లకు విక్రయిస్తున్నట్లు రైతులు చెప్పారు. 

చార్జీల పేరుతో దోపిడీ

ప్రైవేటు ట్రేడర్లకు మక్కలు, ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతుల నుండి చార్జీల పేరుతో దోపిడీ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా వే బ్రిడ్జి కాంటా వేయించినప్పటికీ, హమాలీ, కూలి, దడువాయి చార్జీల పేరుతో బస్తాకు 16 రూపాయల నుండి 23 రూపాయల వరకు కోత విధిస్తున్నారని రైతులు చెబుతున్నారు. నేరుగా వే బ్రిడ్జీ లో కాంట వేయించి ఆ చార్జీలను కూడా రైతులే చెల్లిస్తూ, ప్రైవేటు వ్యాపారికి చెందిన స్థలంలో అన్లోడ్ చేస్తున్నామని, అయినప్పటికీ ఇతర చార్జీల పేరుతో కోతలు పెడుతుండడంతో అటు తగ్గించి రెండు విధాలుగా తాము నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నదాతలు పేర్కొంటున్నారు.