5 June, 2026 | 10:34 PM

భార్యభర్తల మధ్య కలహాలు... మనస్థాపంతో భర్త బలవన్మరణం

05-06-2026 09:44 PM

జవహర్ నగర్,(విజయక్రాంతి): భార్యభర్తల మధ్య కుటుంబ కలహాలు చోటుచేసుకోగా... మనస్థాపం చెందిన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోచోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం... కాప్రా మండల పరిధి ఎల్లారెడ్డిగూడ సీఎస్ నగర్ మిడిపేట ప్రకాష్, భార్య లక్ష్మి, పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. అన్యోన్యంగా సాగుతున్న కుటుంబంలో... గత రెండు సంవత్సరాలుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 4న భార్యభర్తలు గొడవ పడగా కుటుంబసభ్యులైన బస్వారాజ్, గౌరిలకు జరిగిన విషయాన్ని ప్రకాష్ తెలియజేశారు.

ఈ క్రమంలో మనస్థాపం చెందిన ప్రకాష్(44) కుక్కను కట్టేసే బెల్టుతో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు స్థానికులకు ఫోన్ చేసి ప్రకాష్ను చూడమని అడగ్గా... ఉరివేసుకుని కనిపించాడని తెలిపారు. వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేటు దవాఖానాకు తరలించగా మరణించాడని వైద్యులు తెలిపారు. భార్యభర్తల కలహాలు, వేరే ఇతర కారణాలతో మరణించి ఉండొచ్చని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.