భార్యను వదిలి రెండో పెళ్లి చేసుకున్న భర్త!
న్యాయం చేయాలని చందానగర్ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
శేరిలింగంపల్లి, మే 17 (విజయక్రాంతి): కట్టుకున్న భార్య, మూడేళ్ల కొడుకు ఉన్నారన్న సంగతి మరిచిపోయి ఓ వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్న ఘటన చందానగర్‌లో కలకలం రేపింది. విషయం తెలిసి నిలదీసిన మొదటి భార్యపై దాడికి తెగబడటంతో బాధితురాలు కుటుంబంతో కలిసి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది.
వివరాల్లోకి వెళ్తే.. బండా రోహిత్ యాదవ్‌కు మూడేళ్ల క్రితం మహాలక్ష్మితో వివాహమైంది. ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే కొంతకాలంగా భార్యాబిడ్డలను పట్టించుకోవడం మానేసిన రోహిత్, ఇటీవల మహాలక్ష్మికి తెలియకుండా రెండో వివాహం చేసుకున్నాడు.
ఈ విషయం బయటపడటంతో భర్తను ప్రశ్నించేందుకు వెళ్లిన మహాలక్ష్మిపై రోహిత్ చేయి చేసుకున్నాడు. నీతో, నీ కొడుకుతో నాకు అవసరం లేదని బెదిరింపులకు దిగాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహాలక్ష్మి, తన తల్లిదండ్రులు, బంధువులతో కలిసి ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రోహిత్‌ను విచారిస్తామని సీఐ విజయ్ తెలిపారు.






