హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఆపరేషన్ కవచ్.. OYOలో సీపీ సజ్జనార్ తనిఖీలు
లాడ్జ్‌లు, హోటళ్లలో భారీ తనిఖీలు
హైదరాబాద్: నగర పోలీసులు శుక్రవారం రాత్రి నగరంలోని OYO రూమ్స్, లాడ్జీలు, హోటళ్లలో భారీ తనిఖీలు నిర్వహించారు. నగరంలో నేరపూరిత చర్యలకు పాల్పడేందుకు అసాంఘిక శక్తులు చేసే ప్రయత్నాలను అడ్డుకునే లక్ష్యంతో చేపట్టిన "ఆపరేషన్ కవచ్"లో భాగంగానే లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్(Hyderabad CP Sajjanar) తెలిపారు. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో సుమారు 5,000 మంది పోలీసులు పాల్గొన్నారని ఆయన వెల్లడించారు.
లాడ్జీలలో బస చేస్తున్న వ్యక్తుల వివరాలను ధృవీకరించడంతో పాటు, లాడ్జీల యాజమాన్యం నిర్వహిస్తున్న రికార్డులను కూడా పరిశీలించామని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. నగరంలో అంతకుముందు రోజు పోలీసులు వాహనాలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారని, వాహనాలు నడుపుతున్న కొందరు తమ మొబైల్ ఫోన్లకు అనుసంధానించిన ఇయర్‌ఫోన్‌లను వాడుతున్నట్లు గుర్తించారని పేర్కొన్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ అలవాటును అరికట్టేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామని సజ్జనార్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, ఐఎస్ సదన్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.






