28 July, 2026 | 1:01 AM

దళితుల కార్డుతో సామేల్ పంచాయితీ

28-07-2026 12:19 AM
  1. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి
  2. కోమటిరెడ్డి వర్గీయుల డిమాండ్ 

చౌటుప్పల్, జూలై 27: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ కోమటిరెడ్డి బ్రదర్స్‌కు భేషరతుగా క్షమాపణ చెప్పాలని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్ డిమాండ్ చేశారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. అన్ని కులాల ఓట్లతో 50 వేల మెజార్టీతో గెలిచిన మందుల సామెల్ దళితుల కార్డుతో తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయితీ తెస్తున్నాడని విమర్శించారు.

తుంగతుర్తిలోని 66 వేల దళితుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గతంలో రాజగోపాల్‌రెడ్డి దయవల్లే టికెట్ వచ్చిందని చెప్పిన సామెల్ ఈరోజు ఎవరి దయ వల్ల టికెట్ రాలేదని చెప్పడం విడ్డూరమని అన్నారు. ఎమ్మెల్యే తప్పును కప్పిపుచ్చుకోవడం వల్ల కులం ప్రస్తావన తీసుకొస్తున్నాడని విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిపించిన ఏ ఒక్క దళితుడికి పదవులు ఇచ్చావో చెప్పాలని డిమాండ్ చేశారు.

నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయకుండా సొంత అభివృద్ధి కోసమే పాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు.  20 ఏళ్లుగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు పదవులు ఇవ్వకుండా, కాసుల కక్కుర్తి కోసం మండల అధ్యక్ష పదవులు అమ్ముకోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ సమావేశఃలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, మున్సిపాలిటీ అధ్యక్షులు కాసర్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.