9 April, 2026 | 7:07 AM

బీజేపీకే ప్రజల మొగ్గు

14-05-2024 01:12 AM

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసినా మాకే ఓటు

సీఎం రేవంత్‌రెడ్డిని ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు

ఈ ఎన్నికలతో బీజేపీ రాష్ట్రంలో ఒక శక్తిగా అవతరిస్తుంది

రాహుల్‌గాంధీ ఎలాగూ ప్రధాని కాలేరు, కనీసం పెళ్లునా చేసుకోవాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో లోక్‌సభ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని, అలాంటి ఎలక్షన్లు ప్రశాంతంగా ముగియడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. తమ పార్టీ మీద అటు బీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు బీజేపీకే ఓటు వేశారన్నారు. అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారని వెల్లడించారు. పార్టీల కార్యకర్తలు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదని చెప్పారు.

పోలింగ్ ముగిసిన తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యం మరింత బలపడటానికి దోహదపడుతాయన్నారు. అన్ని నియోజకవర్గాల్లో తాము ఊహించిన దానికంటే ఎక్కువగా బీజేపీ పట్ల సానుకూలమైన స్పందన లభించినట్లు చెప్పారు. అర్బన్, గ్రామాల్లోని ఓటర్లు ఆదరించారన్నా రు. పట్టణాలతోపాటు గ్రామాల్లోని ఓటర్లు ముందే చెప్పి మరీ మోదీకి ఓటు వేశారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను, రేవంత్‌రెడ్డిని ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

హామీలు నెరవేరుస్తాం..

ఎనిమిది నెలలుగా పార్టీ గెలుపు కోసం బీజేపీ కార్యకర్తలు కష్టపడ్డారని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాల తర్వాత బీజేపీ రాష్ట్రంలో ఒక శక్తిగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అధిష్ఠానం ఎంతో సహకరించిందన్నారు. ములుగులో సమ్మక్క సారలక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్లు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. యూనివర్సిటీకి తాత్కాలిక క్యాంపస్‌ను ప్రారంభించినట్లు వివరించారు. యూనివర్సిటీ నిర్వహణ కోసం ప్రత్యేకాధికారిని, తర్వాత వీసీని నియమిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, ఫలితాల అనంతరం ఈ అంశాలపై పూర్తిస్థాయి ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు. 

కాంగ్రెస్ దిగజారుడుతనం

రేవంత్‌రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మట్లాడుతున్నారని, ప్రతిసారి ఆయన మోదీని చాలెంజ్ చేస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి మాటలను నాయకులు, కార్యకర్తలు ఏమాత్రం నమ్మడం లేదన్నారు. ఎవరైనా సరే తమ స్థాయి ఏంటో ఆలోచించుకొని సవాళ్లు విసిరితే బాగుంటుందని హితవు పలికారు. జూన్ 4న తేదీన ఎవరేంటో తెలుస్తుందన్నారు. తమ అజెండాలో లేని అంశాలను కూడా తమపై రుద్దారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, దేవుళ్లపై ఒట్లు పెట్టడం రేవంత్‌రెడ్డికే చెల్లిందన్నారు. అధికారంలో ఉన్నామన్న బాధ్యత లేకుండా కాంగ్రెస్ దిగజారిపోయిందన్నారు.

రాహుల్‌గాంధీ పెళ్లిపై కూడా కిషన్‌రెడ్డి సెటైర్లు వేశారు. పీఎం అయితే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని, కానీ ప్రధాని అయ్యే అవకాశం కనుచూపుమేరలో కూడా లేదన్నారు. ఎలాగూ ప్రధాని కాలేరని, కనీసం పెళ్లునా చేసుకోవాలని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అలాగే, ఓటర్ లిస్టును పూర్తిస్థాయిలో సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. జూబ్లీహిల్స్‌లో అనేకమంది ఓటర్ల పేర్లను తొలగించారన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఓటర్ లిస్టులో పారదర్శకత ఉంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.