నైపుణ్యానికి కేరాఫ్ హైదరాబాద్
- దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడితో సీఎం రేవంత్ భేటీ
- ఇరుదేశాల పరస్పర సహకారానికి నిర్ణయం
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- ఆహ్వానం
- సహకారానికి సిద్ధమేనన్న పాల్ మషాటిలే
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): ఐటీ, ఫార్మా, రక్షణ, ఏరోస్పేస్ వంటి అత్యాధునిక రంగాలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తయారు చేసి ప్రపంచానికి అందించే విధం గా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నా రు. ప్రపంచ ప్రఖ్యాత ఫార్చ్యూన్- 500 కంపెనీలు తమ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాయని సీఎం స్పష్టం చేశారు. బుధవారం దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలే నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింలు సమావేశం నిర్వహించారు.
విద్య, నైపుణ్యాభివృద్ధి, మెడికల్, టూరిజం, పరిశ్రమలు వంటి రంగాల్లో పరస్పరం సహరించుకోవాలని, మరిం త విస్తరించుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దక్షిణాఫ్రికా ప్రతినిధులకు తెలంగాణ ప్రత్యేకతలు, ఫ్యూచర్ సిటీ గురించి వివరించారు. విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు హైదరాబాద్‌ను నాలెడ్జ్ సిటీగా మార్చాయని, సాధించిన పురోగతిని వివరించారు. ఆసుపత్రులు, వైద్యులు, చికిత్స విధానంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయన్నారు.
ఈ సమావేశానికి దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సంబంధాల ఉపమంత్రి మొరాకా, భారతదేశానికి దక్షిణాఫ్రికా రాయబారి ఏ. సూక్లాల్, మంత్రులు మోట్సో లెడీ, ఎండాబేని, గినా, గుంగుబెలేతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి వి. శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చోం గ్తు, పాల్గొన్నారు.






