calender_icon.png 7 February, 2026 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ సినిమాను ఆకర్షించేలా హైదరాబాద్ అభివృద్ధి

07-02-2026 12:00:00 AM

గద్దర్ అవార్డు సినిమాల స్క్రీనింగ్ ప్రారంభ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు    

సినీ పురస్కారాల కోసం 90 ఎంట్రీలు 

తెలంగాణ గద్దర్ సినిమా పురస్కారాల్లో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఫిలిం అవార్డులకు దరఖాస్తు చేసుకున్న సినిమాల స్క్రీనింగ్ ప్రక్రియ కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు శుక్రవారం ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఫిలిం ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన ద్వితీయ వార్షిక గద్దర్ అవార్డుల ఫిల్మ్స్ స్క్రీనింగ్ ప్రారంభ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ముఖ్యఅతిథిగా విచ్చేశారు. పోటీకి వచ్చిన సినిమాల వివరాల పుస్తకాన్ని ఆయన ఈ సందర్భంగా జ్యూరీ కమిటీకి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఉగాది రోజున గద్దర్ ఫిలిం అవార్డుల ఫంక్షన్‌ను న భూతో న భవిష్యత్తు అన్నవిధంగా ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహించాలన్నారు.

ప్రపంచ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ వైపు తిరిగి చూసేలా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవసరమైన సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. సినిమా పరిశ్ర మకు అవసరమైన ఆర్థిక, సామాజిక, శాంతిభద్రతలు తదితరాల పరంగా ఎలాంటి పనుల కోసమైనా అర్ధరాత్రి కూడా తమ ప్రభుత్వం తలపులను తట్టవచ్చని చెప్పారు. సినీ కార్మికుల సమస్యను పరిష్కం చడంలో దిల్ రాజు కృషి అభినందనీయమని డిప్యూటీ సీఎం చెప్పారు. 

రికార్డింగ్ స్టూడియోలోనే గద్దర్ చివరి రోజులు 

గద్దర్ చివరి రోజుల్లో తాను ఆయనతోనే ఎక్కువ కాలం గడిపానని, ఆయన స్టూడియోలో అనేక ప్రయోగాత్మక పాటలు పాడారని, చివరి రోజుల్లో గద్దర్ రికార్డింగ్ స్టూడియోలోనే ఎక్కువ రోజులు గడిపారని డిప్యూటీ సీఎం గుర్తు చేసుకున్నారు. సామాజిక మార్పు కోసం కలలను ఉపయోగించి, ప్రజల కోసం తన జీవితాన్ని ధారపోసిన మహానుభావుడు గద్దర్ అని కొనియాడారు. అందుకే ప్ర జా ప్రభుత్వం ఆయన పేరిట సినిమా అవార్డులను ప్రారంభించిందని తెలిపారు.

గత ఏడాది కూడా ఉగాదికే అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించాలనుకున్నామని, కానీ సమయాభావం వల్ల కుదరలేదని చెప్పారు. తెలుగు సినీ పరి శ్రమలోని అన్ని విభాగాలకు అవార్డులను ఇవ్వబోతున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి వెంకట్‌రెడ్డి అందుబాటులో లేరని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, జ్యూరీ కమిటీ చైర్మన్ మణిశర్మ మాట్లాడారు. ఎఫ్‌డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

మార్చి 5 లోపు స్క్రీనింగ్ పూర్తి 

‘గద్దర్ సినీ పురస్కారాలు మొత్తం 90 ఎంట్రీలు వచ్చాయని ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. ఇందులో 68 ఫీచర్ ఫిలిమ్స్ కాగా, 22 లఘు చిత్రాలు, ఇతర సినిమాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈ సినిమాలను మార్చి 5 లోపు జ్యూరీ కమిటీ సినిమాలు చూస్తారని తెలిపారు. మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా అవార్డులు అందజేస్తామని చెప్పారు.