బౌలింగ్ x బ్యాటింగ్

02-05-2024 12:38:44 AM

నేడు రాజస్థాన్‌తో హైదరాబాద్ ఢీ

బ్యాటింగ్ యూనిట్‌పైనే రైజర్స్ భారం

ఐపీఎల్లో రెండు అత్యుత్తమ జట్ల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. ఒక జట్టు బ్యాటింగ్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతుంటే.. మరోజట్టు తమ పటిష్ట బౌలింగ్ లైనప్‌తో ప్రత్యర్థులను గడగడ లాడిస్తోంది. మొదట బ్యాటింగ్ చేస్తే చాలు మ్యాచ్ మ్యాచ్‌కు ప్రమాణాలు పెంచుకుంటున్న జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ అయితే.. బౌలింగ్‌లో సత్తాచాటుతున్న టీమ్ రాజస్థాన్ రాయల్స్. లీగ్‌లో అత్యుత్తమ ప్రత్యర్థుల మధ్య సమరంగా దీన్ని అభివర్ణిస్తుండగా.. ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో విజయం రైజర్స్‌కు కీలకం కానుంది. మరి ఆసక్తికర పోరులో బ్యాట్‌ది పైచేయి అవుతుందా లేక బాల్‌దా అనేది చూడాలి!

హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: ప్లే ఆఫ్స్ దిశగా ముందడుగు వేసేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో అవకాశం. గురువారం మన జట్టు ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీకి సిద్ధమైంది. తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే చాలు భారీ స్కోర్లు సాధిస్తూ.. రికార్డుల దుమ్ముదులుపుతున్న హైదరాబాద్.. ఛేదనలో మాత్రం విఫలమవుతోంది. గత రెండు మ్యాచ్‌ల్లో రెండొందల పైచిలుకు లక్ష్యాలను ఛేదించే క్రమంలో రైజర్స్ బ్యాటింగ్ లైనప్ తడబడింది. లీగ్ దశ ముగియడానికి వస్తుండటంతో లోపాలను సరిచేసుకొని సత్తాచాటాలని రైజర్స్ చూస్తుంటే.. ఈ సీజన్‌లో ఒక్కసారి మాత్రమే ప్రత్యర్థికి 200 పై స్కోరు చేసే అవకాశం ఇచ్చిన రాజస్థాన్ బౌలర్లు.. హైదరాబాద్ హిట్టర్లకు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు. గతంలో కంటే ఎక్కువగా భారీ స్కోర్లు నమోదవుతున్న తాజా సీజన్‌లోనూ రాయల్స్ బౌలింగ్ యూనిట్ దుమ్మురేపుతున్నది. ప్రత్యర్థులకు తగ్గట్లు వ్యూహాలు రచించి భారీ స్కోర్లు చేయకుండా నిలువరిస్తోంది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎనిమిదింట విజయం సాధించిన రాజస్థాన్ 16 పాయింట్లతో పట్టిక అగ్రస్థానాన్ని పదిలం చేసుకోగా.. రైజర్స్ 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. రాయల్స్‌కు ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపు ఖాయం కాగా.. రైజర్స్ ఆ దిశగా గట్టి ప్రయత్నాలు చేస్తోం ది. ఉప్పల్‌లో హైదరాబాద్ తిరిగి సత్తాచాటాలని అభిమానులు ఆశిస్తున్నారు.