calender_icon.png 22 February, 2026 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.1400 కోట్ల ప్రజల భూమిని కాపాడిన హైడ్రా

22-02-2026 02:10:01 AM

కొండాపూర్ రాజరాజేశ్వరి నగర్‌లో 7 ఎకరాల పార్కులు ప్రజావసరాల స్థలాలు రక్షణ

ఆక్రమణల తొలగింపు ఫెన్సింగ్ బోర్డుల ఏర్పాటు

శేరిలింగంపల్లి,ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): ఐటీ కారిడార్ హృదయంలో కోట్ల విలువైన భూములపై కన్నేసిన ఆక్రమణదారులకు హైడ్రా గట్టి హెచ్చరిక పంపింది. శేరిలింగంపల్లి కొండాపూర్ లోని రాజరాజేశ్వరి నగర్ కాలనీలో లే ఔట్లో పార్కులు, పాఠశాలలు, కమ్యూనిటీ హాల్ల కోసం కేటాయించిన సుమారు 7 ఎకరాల భూమిని హైడ్రా శనివారం కాపాడింది. మార్కెట్ విలువ అంచనా ప్రకారం ఈ భూముల విలువ రూ.1400 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.

1993లో సర్వే నంబర్లు 78 నుంచి 93 వరకు 2059 ప్లాట్లతో గ్రామపంచాయతీ లే ఔట్ ఆమోదం పొందింది. అందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 5 ఎకరాలు, పాఠశాలకు దాదాపు ఎకరా, పార్కులకు ఎకరాకు పైగా, కమ్యూనిటీ హాల్కు 2181 గజాలు కేటాయించారు. అయితే కాలక్రమంలో ఈ ప్రజావసరాల స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయి. పాఠశాల స్థలంలో వెయ్యి గజాల మేర అపార్ట్మెం ట్ నిర్మాణం, కమ్యూనిటీ స్థలంలో ప్రైవేటు షాపులు, షెడ్లు వెలసినట్టు అధికారులు గుర్తించారు.

ప్రజావాణి ఫిర్యాదు, క్షేత్ర స్థాయి దర్యాప్తు

కాలనీ సంక్షేమ సంఘం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. లే ఔట్ ప్రకారం ఈ భూములు పార్కులు, ప్రజావసరాలకే చెందినవని నిర్ధారించారు. యూఎల్సీ భూములలోని ప్లాట్లు ఎల్‌ఆర్‌ఎస్ అయినప్పటికీ పార్కులు, ప్రజా స్థలాలు ఎల్‌ఆర్‌ఎస్ కాకుండా ప్రైవేటు సొంతాలుగా మారడం ఎలా అన్న ప్రశ్నలను అధికారులు పరిశీలించారు.ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ వేసి, ప్రజావసరాల స్థలం అని హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు.

దీంతో సుమారు ఐదు వేల కుటుంబాలకు ఉపయోగపడే పార్కులు, కమ్యూనిటీ స్థలాలు తిరిగి రక్షణలోకి వచ్చాయి. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యకు తుది పరిష్కారం దొరికిందని నివాసితులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాలకు కేటాయించిన భూములపై ఎవరూ కన్నేయకూడదని, ఇలాంటి ఆక్రమణలను సహించబోమని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.