22-02-2026 02:09:47 AM
ఆరోరా కాలేజీ యాజమాన్యానికి కట్టబెట్టారన్న షబ్బీర్
చర్చకు రావాలని కాటిపల్లి సవాల్
ఎమ్మెల్యేను గృహ నిర్బంధం చేసిన పోలీసులు
రోడ్ల మీదకు కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు
క్యాంపు ఆఫీసుకు వెళ్తున్న కాంగ్రెస్ నేత కారును ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు
ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.. భారీ బందోబస్తు
కామారెడ్డికి వెళ్తున్న బీజేపీ నేతల అరెస్టు
కామారెడ్డి, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రం బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఆరో పణలు, ఆందోళనలతో రణరంగంగా మారింది. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చేసిన ఆరోపణల తో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది.
అరోర కాలేజీకి ప్రభుత్వ కాలేజీ భూములను ఎమ్మెల్యే అమ్ముకున్నాడని షబ్బీర్ అలీ ఆరోపణలు చేయగా.. నిజాలు నిగ్గు తేల్చేందుకు కామారెడ్డి శిశుమందిర్ వద్ద శనివారం చర్చకు రావాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్ నాయకులు స్పందించి ఆధారాలతో వస్తామని పేర్కొన్నారు. దీంతో శనివారం ఉదయం 10 గంటలకు కామారెడ్డి సరస్వతి శిశు మందిర్ వద్దకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు వస్తారని ఊహించిన పోలీసులు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని గృహ నిర్బం ధం చేశారు.
అయితే సరస్వతి శిశు మందిర్ వద్దకు కాంగ్రెస్ నాయకులు వచ్చి, ఎమ్మెల్యే కాటిపల్లి ముఖం చాటేశారని, కళాశాల ఆస్తులు అమ్ముకోవడంలో ఎమ్మెల్యే పాత్ర ఉందని రుజువు చూపడానికి పత్రాలతో వచ్చినట్లు ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీ ప్ కుమార్, భిక్కనూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమ్‌రెడ్డి, భిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మాజీ సర్పంచ్ నెట్టు వెంకట్రా వు, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, గొడుగుల శ్రీనివాస్‌తో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు సరస్వతి శిశు మందిర్ వద్దకు చేరుకొని నినాదాలు చేశారు.
దీంతో పోలీసులు అడ్డుకొని కాంగ్రెస్ నాయకులను తాడ్వాయి, మాచారెడ్డి, దేవునిపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మహేందర్‌రెడ్డి తన అనుచరులతో కారులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు వెళ్తుండగా బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. కారు ను ధ్వంసం చేశారు. కారును మంట పెట్టగా.. పోలీసులు అడ్డుకొని కాలకుండా చూశారు. పోలీసులు మహేందర్‌రెడ్డిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యానికి మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు తరలి రావడంతో పోలీసులు అడ్డుకు న్నారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ నాయకులను అడ్డుకొని పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు కాంగ్రెస్ నాయకులు రావద్దని పోలీసులు వేడుకున్నారు.
ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద ర్‌రావు పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు మేడ్చల్ వద్ద అడ్డుకున్నారు. మరి కొంతమందిని తూప్రాన్, బిక్కనూర్ పోలీస్ స్టేషన్‌ల వద్ద అడ్డుకొని అరెస్టు చేశారు. ఆధారాలతో కలెక్టరేట్‌కు రా..: కాటిపల్లి శనివారం సాయంత్రం కామారెడ్డిలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకులను అడ్డుకోవడం తగదన్నారు.
తనపై ఆరోపణలు చేసిన షబ్బీర్ అలీని ఆధారాలతో వచ్చి చూపాలని కోరితే.. అతడు రాకుండా వందలాదిమంది అనుచరులను పంపించి గొడవ చేశారని చెప్పారు. బాన్సువాడలో జరుగుతు న్న గొడవ కారణంగా పోలీసులు సహకరించాలని కోరడం వల్లనే తాను గృహ నిర్బంధంలో ఉన్నానని తెలిపారు. ఆ విషయం తెలిసి కూడా షబ్బీర్ అలీ తన అనుచరులను పంపి హం గామా చేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నా రు.
నిజంగా ఆధారాలు చూపాలి అనుకుంటే సోమవారం కలెక్టరేట్‌కు రావాలని, తానూ వస్తానని అక్కడే తేల్చుకుందామని రమణారెడ్డి సవాల్ విసిరారు. లేనిపోని ఆరోపణలు చేస్తూ కార్యకర్తలను రెచ్చగొట్టి నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం షబ్బీర్ అలీ చేస్తున్నాడని మండిపడ్డారు. తనకు ఏదైన హానీ జరిగితే ప్రజా ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
తనకు రాజకీయ భిక్ష షబ్బీర్ అలీ పెట్టలేదని, తన తండ్రి రాజారెడ్డి షబ్బీర్ అలీకి రాజకీయ భిక్ష పెట్టాడని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మరిచిపోయి షబ్బీర్ అలీ మాట్లాడుతున్నాడు అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై ఇప్పటికే ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. సోమవారం నిజాలు తేల్చకుంటే గ్రా మాలకు వెళ్తానని షబ్బీర్ అలీ చేసిన అవినీతిని గ్రామ గ్రామాన వివరిస్తానని హెచ్చరించారు.
రెచ్చగొట్టిన వారిని వదలం: ఎస్పీ వివాదాలకు పాల్పడిన వారిని, రెచ్చగొట్టేలా వ్యవహరించిన వారిని వదిలేది లేదని కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరలిస్తామని ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్దకు వెళ్లకుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆగకుండా కారులో వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత గీరెడ్డి మహేందర్‌రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.
సమాధానం చెప్పాలి: కాంగ్రెస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల కుంభకోణంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాత్ర లేకుంటే తాము సంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరన్ సందీప్ కుమార్, పట్ట ణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాలు విసిరి, వెన్నుచూపారంటూ ఎద్దేవా చేశారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిరక్షణ కమిటీలో ఎమ్మెల్యే మెంబర్ ఎలా అయ్యారో సమాధానం చెప్పాలన్నారు. మీ తండ్రి కేపీ రాజారెడ్డి కోశాధికారిగా, మీరు సభ్యులుగా ఉన్న కమిటీలో జరిగిన అక్రమాలకు మీరే బాధ్యత వహించాలన్నారు. మీ మిత్రుడైన అరోరా కాలేజీ యాజమాన్య కుటుంబానికి ఈ కమిటీలో చోటు ఎలా కల్పించారో వివరించాలని కోరారు.
కాలేజీ భూములకు సంబం ధించిన పత్రాలు మీ తండ్రి వద్ద ఉండగా, అవి అరోరా కాలేజీ యాజమాన్యం చేతికి ఎలా వెళ్లాయి? అని ప్రశ్నించారు. ఆ పత్రాలను బ్యాంకులో కుదువ పెట్టి రూ.6కోట్ల అప్పు తీసుకున్న మాట వాస్తవం కాదా అని నిలదీశారు. కొత్త వారికి కమిటీలో సభ్యత్వం ఇచ్చిన పాత కమిటీ సభ్యులందరూ రాజీనామెందుకు చేశారో చెప్పాలన్నారు. కుంభకోణంపై ఎమ్మె ల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.