17 July, 2026 | 12:47 AM

బంజారాహిల్స్‌లో రూ.600 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

17-07-2026 12:00 AM

మరో రెండు ప్రాంతాల్లో 1800 గజాల పార్కులకు ఫెన్సింగ్

హైదరాబాద్ సిటీ బ్యూరో, జులై 16( విజయక్రాంతి): బంజారాహిల్స్లోని రోడ్డు నంబ రు 13లో బంజారా లేక్‌ను ఆనుకుని ఉన్న 3.63 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా గురువారం కాపాడింది. దీని విలువ రూ. 600ల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. నిజాం కాలంలో జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ లే ఔట్లో అన్ రికగ్నైజ్డ్ ప్లాట్గా మిగిలిన ఈ భూమి కోర్టు వివాదంలో ఉంది.

ఈ భూమి ని ఆక్రమించుకునేందుకు చాలామంది ప్ర యత్నిస్తున్నారని, దీనిని కాపాడి పార్కుగా అ భివృద్ధి చేయాలని బంజారాహిల్స్ లేక్ పరిరక్షణ సమితితో పాటు.. స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా పరిశీలించి కోర్టు వివాదం తేలే లోపు ఎవరూ కబ్జా చేయకుండా ఫెన్సింగ్ వేసింది. కేసు వివరాలను పొందుపరుస్తూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. 

వెంకటాద్రినగర్‌లో.. 

హయత్నగర్ మండలం మామిళ్ల గ్రామ పరిధిలోని వెంకటాద్రి నగర్లో 800 గజాల పార్కును హైడ్రా కాపాడింది. 1975లో 7.20 ఎకరాల పరిధిలో 118 ప్లాట్లతో లే ఔట్ వేయగా.. అందులో 800 గజాలను పార్కు కోసం కేటాయించారు. ఇలా కేటాయించిన పార్కు స్థలాన్ని ప్లాట్లుగా చేసి లే ఔట్ వేసిన వాళ్లు అమ్మేశారు. గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేసేయడం.. దానిమీద బ్యాంకు రుణాన్ని పొందడం జరిగింది. బ్యాంకు రుణం తిరిగి చెల్లించకపోవ డంతో బ్యాంకర్లకు అనుమానం వచ్చి విచారించగా పార్కు స్థలంగా తేలింది.

ఇంతలో మరో వ్యక్తి రంగప్రవేశం చేసి బ్యాంకు రుణం చెల్లింపును తక్కువ మొత్తంలో సెటిల్ చేసుకుంటానని ఆ భూమిలో ప్రీకాస్ట్ వాల్స్ నిర్మించి ఆక్రమణలో ఉన్నారు. ఇదే సమయంలో కోర్టు తీర్పు కూడా వచ్చింది. పార్కు స్థలంగా కోర్టు నిర్ధారించింది. అయినప్పటికీ ఖాళీ చేయకుండా ఆక్రమణలో ఉండగా.. అక్కడి నివాసితులు హైడ్రా ప్రజావాణిలో పైన పేర్కొన్న అంశాలను చెబుతూ ఫిర్యాదు చేశారు. హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించి స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసింది.