12 April, 2026 | 2:53 AM

ఐలాపూర్‌లో హైడ్రా పంజా!

12-04-2026 01:05 AM
  1. అక్రమ కట్టడాలపై బుల్డోజర్ దాడి 
  2. అమీన్‌పూర్‌లో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు
  3. కబ్జాదారుని గెస్ట్ హౌజ్, సోదరుని ఆరు అంతస్థుల భవనం కూల్చివేత
  4. రూ.15వేల కోట్ల విలువైన 860 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఫోకస్
  5. సీఎం చిత్రపటానికి ప్రజల క్షీరాభిషేకం
  6. కూల్చివేతపై స్టే లేదు:హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

సంగారెడ్డి/అమీన్‌పూర్/సికింద్రాబాద్, ఏప్రిల్ 11(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఐలాపూర్‌లో హైడ్రా పంజా విసిరింది. అక్రమ కట్టడాలపై బుల్డోజర్లు విరుచుకుపడ్డాయి.  శనివారం తెల్లవారుజాము నుంచి అమీన్‌పూర్‌లో అక్రమార్కుల గుండెలను హైడ్రా హడలెత్తించింది. కబ్జాదారుని గెస్ట్ హౌజ్, సోదరుని ఆరు అంతస్థుల భవనాన్ని కూల్చివేసింది.

స్టే ఆర్డర్‌ను లెక్కచేయని నిర్మాణా లను నేలమట్టం చేసింది. సుమారు రూ.15 వేల కోట్ల విలువైన 860 ఎకరాల ప్రభుత్వ భూమిపై హైడ్రా ఫోకస్ పెట్టింది. దీంతో సీఎం చిత్రపటానికి ప్రజలు క్షీరాభిషేకం చేసి, హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఐలాపూర్‌లో అక్రమ నిర్మాణాలపై ఎటువంటి స్టే లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇటీవలనే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగతో కలిసి అడ్వకేట్ ముఖీమ్ తమ భూముల్లోకి హైడ్రా అడుగుపెట్టవద్దని హెచ్చరికలు జారీచేసిన విషయం విదితమే ఇది జరిగిన రెండు రోజులకే హైడ్రా పంజా విసిరింది.

ఐలాపూర్‌లో భూ కబ్జాదారుడి గెస్ట్‌హౌస్ (సుమారు రెండు ఎకరాలు), అలాగే అతని సోదరుడు నిర్మించిన ఆరు అంతస్తుల భవనా న్ని రెవె న్యూ, జీహెచ్‌ఎంసీతో కలిసి హైడ్రా అధికారు లు కూల్చివేశారు. ఐలాపూర్ గ్రామ సమీపంలో సర్వే నంబర్లు 171, 172, 173, 174, 212, 213లో సుమారుగా 1,263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు నిర్మా ణం కావడంతో వాటి జోలికి వెళ్లకుం డా మిగిలి ఉన్న సుమారు 860 ఎకరాల ప్రభు త్వ భూమిని కాపాడడమే లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని హైడ్రా అధికారులు వెల్లడించారు.

సుమారు రూ.15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించినట్లు తెలిపారు. భారీస్థాయిలో అక్రమ కబ్జాలను గుర్తించి చర్యలు చేపట్టామని, ప్రత్యేక డ్రైవ్ ద్వారా మిగిలిన భూమిని కాపాడడమే ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. హైడ్రా ఈ చర్యలకు ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఇదిలా ఉంటే ఐలాపూర్‌లో మొదటి నుంచి ప్రభుత్వ భూముల వివాదం కొనసాగుతూనే ఉంది.

న్యాయవాది ముఖీమ్, అతని సోదరుల భూముల ను కబ్జా చేసి, అక్రమంగా నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యం లో ఇటీవల ముఖీమ్ మీడియా సమావేశాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగతో కలిసి ఏర్పాటు చేశారు. తమ భూముల్లోకి హైడ్రా అడుగుపెట్టవద్దని హెచ్చరికలు జారీచేశారు. ఇది జరిగిన రెండు రోజులకే హైడ్రా తన పంజాను విసిరింది.

అయితే అక్రమార్కులు హైడ్రాను అడ్డుకునేం దుకు ఆరు అం తస్తుల భవనంలో తాత్కాలికంగా కిరాయిదారులను తీసుకొచ్చి హంగామా సృష్టిం చారు. అయిన ప్పటికీ హైడ్రా ముందు వారి ఆటలు సాగలేదు. భవనంలో ఉన్న వారిని తరలించి కూ ల్చివేశారు. 

అనుమతులిచ్చిన వారిపై చర్యలుంటాయా?

ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఎలా వచ్చాయన్న అంశంపై అను మానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత శాఖల అనుమతుల ప్రక్రియపై ప్రశ్నల వెల్లు వ కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాలకు అధికారుల మౌనమే కారణమా అన్న చర్చ కూడా జరుగుతోంది.

పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిర్లక్ష్యం లేదా అవినీతి నిరూపితమైతే బాధ్యులపై సస్పెన్షన్ సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు వెలువడుతున్నాయి. 

నిర్మాణాల కూల్చివేతపై స్టే లేదు: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపురంలో హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. ఐలాపు రం భూములపై 1998లో హైకోర్టు స్టేటస్ కో ఉంద ని, ప్రభుత్వ భూములను ఆక్రమించి ముఖీమ్ అనే వ్యక్తి ఫాంహౌస్ నిర్మిం చుకున్నాడని చెప్పారు. ఫాంహౌస్ కేంద్రం గా 66 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడ్డాడు. 2006లో నిర్మించిన ఫాంహౌస్‌ను ఇప్పుడు 40 ఎకరాలకు విస్తరించాడు.

20 ఏళ్లుగా ముఖీమ్ తన అనుచ రులతో కలిసి భూదందాలు చేస్తున్నాడు. ప్రభుత్వ భూములను ప్లాట్లుగా విక్రయించి రూ. కోట్లు సొమ్ము చేసుకున్నాడు. ముఖీమ్ 100 గజాల భూమికి రూ.10 లక్షల చొప్పున పేదలకు విక్రయించాడు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ భూ అక్రమాలకు పాల్ప డ్డాడు. ఐలాపూర్ అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు.

సామాజిక మాధ్యమాల్లో హైడ్రా కూల్చివేతలపై తప్పు గా ప్రచారం చేస్తున్నారు అని కమిషనర్ రంగనాథ్ అన్నారు. శనివారం భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు చేపట్టిన సంగతి తెలిసిందే. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి భారీ ఆపరేషన్ నిర్వహించింది. ముఖీమ్ అనే వ్యకి అక్రమంగా నిర్మించిన 6 అంతస్తు భవనంలో 45 ఫ్లాట్లుండగా సగం వరకూ నిండాయి. వారంతా కిరాయికి దిగిన వారే, అందరూ ఖాళీ చేసి వెళ్లాకే హైడ్రా మొత్తం అపార్టుమెంట్‌ను కూల్చివేసింది.

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

ఐలాపూర్‌లో అక్రమార్కులు కట్టిన భవనాలను కూల్చివేసి, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి హైడ్రా చేపట్టిన ఆపరేషన్‌కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతోంది. ఈ మేరకు ఆనంద్ నగర్ కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఐలాపూర్‌లోని సర్వే నంబర్ 1-220 వరకు గల 1,264 ఎకరాల భూ సమస్యను పరిష్కరించినందుకు బాధితులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో స్థానికుల్లో సంబరాలు నెలకొన్నాయి. ఇది 40 ఏళ్ల కలగా వారు పేర్కొన్నారు.