17 May, 2026 | 1:18 AM

సైలెంట్ కిల్లర్‌గా హైపర్‌టెన్షన్

17-05-2026 12:00 AM

ఒకప్పుడు వృద్ధాప్యంలో కనిపించే వ్యాధిగా భావించిన హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు) ఇప్పుడు 20-30 ఏళ్ల యువతలో కూడా వేగంగా పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 140 కోట్ల మం ది హై బీపీతో బాధపడుతుండగా, అందులో కేవలం నలుగురిలో ఒక్కరికి మాత్రమే రక్తపోటు నియంత్రణలో ఉంది.

భారతదేశంలోనే సుమారు 22 కోట్ల మంది హైపర్టెన్షన్తో బాధపడుతున్నారని అంచనా. అయితే వారిలో కేవ లం 12 శాతం మందికే సరైన నియంత్రణలో ఉంది. ఇటీవలి అధ్యయనాలు ఆందోళనకర విషయాలను వెల్లడిస్తున్నాయి. 18-25 ఏళ్ల మధ్య వయస్సు గల ప్రతి 10 మందిలో ఒకరికి ఇప్పటికే హై బీపీ కనిపిస్తోంది. 

ఈ నేపథ్యంలో ‘ప్రపంచ హైపర్టెన్షన్ డే’ సందర్భంగా ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రిలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ‘కలిసికట్టుగా రక్తపోటును నియంత్రిద్దాం’ అనే ఈ ఏడాది థీమ్‌తో ఆస్పత్రి వైద్య నిపుణులు పలు హెచ్చరికలు చేశారు. ఆధునిక జీవనశైలి, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఫాస్ట్ ఫుడ్ అలవాట్ల కారణంగా యువతలో కూడా హైబీపీ వేగంగా పెరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రక్తపోటును ప్రారంభ దశలోనే గుర్తించి జీవనశైలి మార్పులు, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలను నివారించవచ్చని సూచించారు.

యువతలో ప్రధాన ఆరోగ్య సమస్య

ఈ సందర్భంగా ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, హెచ్వోడీ డాక్టర్ ఎ రవికాంత్ మాట్లాడుతూ.. ‘హైపర్టెన్షన్ ప్రస్తుతం యువతలో వేగంగా పెరుగుతున్న ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. అధికంగా ఫోన్లు చూడడం, నిద్రలేమి , జంక్ ఫుడ్, అధిక ఉప్పు వినియోగం, దీర్ఘకాలిక ఒత్తిడి, ఉద్యోగ ప్రెషర్, శారీరక శ్రమలేమి, ధూమపానం, మద్యం అలవాట్లు వంటి కారణాలు రక్తనాళాల కెపాసిటీని తగ్గించి 30 ఏండ్ల లోపే హై బీపీ కేసులు పెరుగుతున్నాయి.

దీంతో 40 ఏళ్లకు ముందే గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం వల్ల దీనిని సైలెంట్ కిల్లర్‌గా పిలుస్తారు. గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలకు ఇది ప్రధాన కారణంగా మారుతోంది. అందుకే  ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా బీపీ పరీక్షలు చేయించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి.’ అని సూచించారు. 

నిర్లక్ష్యం చేస్తే గుండె సమస్యలు

కామినేని కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జి శివ ప్రసాద్ మాట్లాడు తూ.. ‘హైపర్‌టెన్షన్‌ను నిర్లక్ష్యం చేస్తే చిన్న వయస్సులోనే గుండె సంబంధిత తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మానసిక ఆందోళనలు యువత ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో వంశపారపర్యంగా హైపర్టెన్షన్ ఉన్నవారు మరింత అలర్ట్గా ఉండాలి. కుటుంబం, వైద్యులు, సమా జం కలిసి అవగాహన పెంచితేనే హైపర్టెన్షన్ను సమర్థంగా ఎదుర్కోవచ్చు.’ అని పేర్కొన్నారు.

కామినేని కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శశిధర్ మడక మాట్లాడుతూ.. ‘యువతలో ఈ సమస్య పెరుగుతుండడమే ఆందోళనకరం. రోజుకు కనీసం 30-45 నిమిషాల వ్యాయా మం, తక్కువ ఉప్పు ఉన్న ఆహారం, సరిపడ నిద్ర, ఒత్తిడి నియంత్రణ ద్వారా హైపర్టెన్షన్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలే హై బీపీ నియంత్రణకు ఉత్తమ మార్గం.’ అని చెప్పారు.