28 August, 2026 | 2:36 AM

నేను తెలంగాణ వ్యక్తినే

28-08-2026 01:32 AM
  1. మా పూర్వీకులది ఖమ్మం 
  2. నేను ఆంధ్రా వ్యక్తినన్న కవిత వ్యాఖ్యలు సరికాదు 
  3. బ్రాహ్మణులను అవమానించొద్దు
  4. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బీ శ్రీనివాస్ 

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): చెప్పుడు మాటలు చేటు తెస్తాయనే విషయాన్ని టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత(TRS leader Kavitha) గమణించాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు బసవరాజు శ్రీనివాస్ సూచించారు. బ్రహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ పదవి విషయంలో కవిత చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. వ్యక్తుల ప్రాంతీయతను ముందుకు తెచ్చి ఒక సామాజిక వర్గాన్ని విభజించే ప్రయత్నం చేయడం తగదని హితవుపలికారు.

గురువారం గాంధీభవన్‌లో బ్రాహ్మణ కార్పొరేషన్ వైస్ చైర్మన్ సుబ్రహ్మణ్య ప్రసాద్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తనను చైర్మన్‌గా  ప్రభుత్వం నియమించడం వెనుక ఎలాంటి ప్రాంతీయ అంశం లేదని, బ్రాహ్మణ సమాజ సంక్షేమం కోసం పనిచేయాలన్న ఉద్దేశంతోనే బాధ్యతలు అప్పగించారని తెలిపారు. కవిత ఆరోపించినట్టుగా తాను ఆంధ్రా ప్రాంత వ్యక్తిని కాదని, పూర్వీకులు ఖమ్మం ప్రాంతావాసులని, తాను నల్లగొండ జిల్లా నడిగూడెంలో జన్మించానని,  చదువంతా తెలంగాణలోనే సాగిందని వివరించారు.

పదవులు ప్రాంతంతోపాటు వారి సామర్థ్యం, సేవా భావం, సమాజానికి చేసిన కృషిని పరిగణనలోకి తీసుకుని ఇస్తారనే విషయం ఎంపీ, ఎమ్మెల్సీగా పనిచేసిన కవితకు తెలియకపోవడం విచారకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో బ్రాహ్మణ సమాజం కూడా తన వంతు పాత్ర పోషించిందని పేర్కొన్నారు. తెలంగాణలోని బ్రాహ్మణుల సంక్షేమం, పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం, విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు.

బ్రాహ్మణ సమాజాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలని, అన్ని పార్టీలకు చెందిన బ్రాహ్మణ బంధువులు తన పదవీప్రమాణ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆ విషయాన్ని తన పార్టీలోని బ్రాహ్మణ వ్యక్తులను అడగాలని కవితకు సూచించారు.

ప్రాంతం గురించి ప్రశ్నించడం కంటే, బ్రాహ్మణుల కోసం నేను ఏం చేస్తానన్నదే ముఖ్యమని, కవిత చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా తనను బాధించడమే కాకుండా, బ్రాహ్మణ సమాజాన్ని కూడా అవమానించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రాంతీయత పేరుతో సమాజంలో చిచ్చు పెట్టడం కంటే తెలంగాణ అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు.