28 August, 2026 | 5:16 AM

విద్యార్థుల ముఖాల్లో ‘యూనిఫాం’ వెలుగులు

28-08-2026 01:32 AM

నాణ్యమైన వస్త్రం.. ప్రత్యేక శ్రద్ధతో కుట్టింపు

స్వయం సహాయక సంఘాల మహిళలతో యూనిఫాంల తయారీ

32,580 మంది విద్యార్థులకు ఇప్పటికే పంపిణీ

కొత్త యూనిఫాంలపై విద్యార్థుల్లో ఆనందం

ఖమ్మం, ఆగస్టు- 27(విజయక్రాంతి): కొత్త యూనిఫాం.. కొత్త ఉత్సాహం.. కొత్త ఆత్మవిశ్వాసం. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ ఏడాది అందిస్తున్న యూనిఫాంలు వారి ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నాయి. అత్యుత్తమ నాణ్యత కలిగిన వస్త్రాన్ని సమకూర్చడంతో పాటు, కుట్టింపులోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో యూనిఫాంలు నాణ్యత, సౌకర్యం, ఆకర్షణలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

నాణ్యతకు పెద్దపీట:

ఈ ఏడాది విద్యార్థుల యూనిఫాంల కోసం మంచి నాణ్యత కలిగిన వస్త్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వస్త్రం ఎంపిక నుంచి యూనిఫాం కుట్టింపు వరకు ప్రతి దశలో నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చారు. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా సరైన కొలతలు, చక్కటి ఫిట్టింగ్తో యూనిఫాంలను కుట్టిస్తున్నారు. కొత్త యూనిఫాంలు ధరించి పాఠశాలలకు వస్తున్న విద్యార్థులు వాటి నాణ్యతపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘యూనిఫాం చాలా బాగుంది.. వస్త్రం నాణ్యంగా ఉంది.. వేసుకుంటే సౌకర్యంగా ఉంది” అంటూ విద్యార్థులు ఆనందంగా చెబుతున్నారు. ఉపాధ్యాయులు కూడా యూనిఫాంల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మహిళా సంఘాల చేతుల్లో..

యూనిఫాంల తయారీలో స్వయం సహాయక సంఘాల మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. తమ కుట్టు నైపుణ్యంతో విద్యార్థుల యూనిఫాంలను నాణ్యతతో తయారు చేస్తున్నారు. విద్యార్థుల కొలతలకు అనుగుణంగా కుట్టడంతో పాటు ఫిట్టింగ్, కుట్టుపని నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దీంతో ఒకవైపు విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలు అందుతుండగా.. మరోవైపు గ్రామీణ మహిళలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం చేపట్టిన కార్యక్రమంలో మహిళా సంఘాల భాగస్వామ్యం స్ఫూర్తిదాయకంగా మారింది.

జిల్లాలో 68,387 మంది విద్యార్థులకు లక్ష్యం:

జిల్లాలో మొత్తం 68,387 మంది విద్యార్థులకు యూనిఫాంలు అందించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 34,850 యూనిఫాంల కుట్టింపు పూర్తయింది. 32,580 యూనిఫాంలను ఇప్పటికే విద్యార్థులకు అందజేశారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ, గిరిజన, బీసీ సంక్షేమ విద్యా సంస్థల్లో 20,634 మంది విద్యార్థులకు గాను 19,850 యూనిఫాంల కుట్టింపు పూర్తు, 19,580 యూనిఫాంలు పంపిణీ చేశారు. జెడ్పీ, ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలల్లో 43,775 మంది విద్యార్థులకు యూనిఫాంలు అందించాల్సి ఉండగా, ఇప్పటివరకు 15 వేల యూనిఫాంల కుట్టింపు పూర్తు, 13 వేల యూనిఫాంలు పంపిణీ చేశారు.

ఒక యూనిఫాం.. ఎన్నో మార్పులు:

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాం అందించడం ద్వారా వారిలో సమానత్వం, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతున్నా యి. కొత్త యూనిఫాం ధరించి పాఠశాలకు రావడం విద్యార్థుల్లో పాఠశాల పట్ల మరింత ఆసక్తిని పెంచుతోంది. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మార్గదర్శకత్వం లో డిఆర్డిఏ.- సెర్ప్, విద్యాశాఖ, సంక్షేమ శాఖలు, స్వయం సహాయక సంఘాల మహిళలు సమన్వ యంతో పనిచేస్తూ యూనిఫాంల కుట్టింపు, పంపిణీ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

విద్యార్థుల ఆనందమే విజయానికి కొలమానం:

నాణ్యమైన వస్త్రం.. ప్రత్యేక శ్రద్ధతో కుట్టింపు.. మహిళా సంఘాల భాగస్వామ్యం.. విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వు. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది పాఠశాల యూనిఫాం కార్యక్రమం విద్యార్థుల సంక్షేమం, మహిళా సాధికారతను కలిపిన ఒక విజయగాథగా నిలుస్తోంది.