calender_icon.png 7 December, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుమ్మడి నర్సయ్యగా నటించడం గర్వంగా ఉంది

07-12-2025 12:29:04 AM

మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథను తెరపైకి తీసుకొస్తున్నారు దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే. ‘గుమ్మడి నర్సయ్య’ అనే పేరుతో రాబోతున్న ఈ బయోపిక్‌లో కన్నడ హీరో శివరాజ్‌కుమార్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రవల్లిక ఆరట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్ సురేశ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీతం సమకూర్చుతుండగా, -సతీశ్ ముత్యాల డీవోపీ, సత్య గిడుతూరి ఎడిటర్. ఈ చిత్ర ప్రారంభోత్సవం శనివారం పాల్వంచలో లాంఛనంగా ప్రారంభమైంది.

సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని మల్లు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. “ఈ వ్యవస్థలో మార్పు రావాలి, మనందరిలో మార్పు రావాలి. ఒకరినొకరు మోసం చేసుకునే పద్ధతులు మారాలి. ఇదే నేను కోరుకునేది. నేనేం గొప్ప నాయకుడిని కాదు, అందరిలా సామాన్యుడినే. నన్ను గొప్పగా కాకుండా నా భావాలను మాత్రమే ఈ సినిమాలో చూపించాలని ఆశిస్తున్నా.

ఈ సినిమా రిలీజ్ తర్వాత వ్యవస్థలో, ప్రజల్లో మార్పు రావా లని కోరుకుంటున్నా” అన్నారు. చిత్ర కథా నాయకుడు శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. “ఒక మంచి మనిషి రోల్‌లో నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. మా నాన్న కూడా గుమ్మడి నర్సయ్యలాగే ప్రజాసేవ చేసిన మనిషి. మన కోసం కాదు.. ఇతరుల కోసం బతకాలని మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు. ఇటీవల గుమ్మడి నర్సయ్య ఇంటికి వెళ్తే మళ్లీ మా నాన్న దగ్గరకు వచ్చినట్లు అనిపించింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటా.. నేనే స్వయంగా డబ్బింగ్ చెప్తా.

మీ అందరి ఆశీర్వాదం మాపై ఉంటుందని ఆశిస్తున్నా. రాజకీయ నాయకులందరికీ స్ఫూర్తిదాయకమైన సినిమా అవుతుందిది” అని చెప్పారు. దర్శకుడు పరమేశ్వర్ మాట్లాడుతూ.. “రాజకీయం అంటే ఉద్యోగమో, వ్యాపారమో కాదు.. ఇదొక సామాజిక బాధ్యత అని మళ్లీమళ్లీ గుర్తు చేసేందుకే ఈ సినిమా చేశాను. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి ప్రజాసేవ తప్ప పైసా కూడా సంపాదించుకోని గుమ్మడి నర్సయ్య గొప్పతనాన్ని మీరు తెరపైనే చూడాలి.

ఒక గొప్ప కథలో ఒక గొప్ప హీరో డాక్టర్ శివరాజ్‌కుమార్ దొరకడం నా అదృష్టం” అన్నారు. ‘మా సినిమా గుమ్మడి నర్సయ్యగా నటించిన శివరాజ్‌కుమార్ ఓ రియల్ హీరో, మనసున్న మనిషి. ఉద్యమగడ్డ అయిన పాల్వంచ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. ఈ సినిమా రిలీజ్ తర్వాత రాజకీయాల్లో కచ్చితంగా మార్పు వస్తుందని భావిస్తున్నాన’ని నిర్మాత సురేశ్‌రెడ్డి తెలిపారు.