కాళ్లు మొక్కుతా.. వడ్లు కొనండి
- గజ్వేల్‌లో అన్నదాతల ఆవేదన
- వడ్లను తగలబెట్టి నిరసన
నిర్మల్, మే 23 (విజయక్రాంతి)/గజ్వేల్/మనోహరాబాద్: ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మీ కాళ్లు మొక్కుతాం మా ధాన్యం కొనండి’ అంటూ రైతులు గజ్వేల్‌లో తమ ఆవేదనను ఆందోళన రూపంలో వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శనివారం రైతులు భారీ నిరసనకు దిగారు. 50 రోజుల నుంచి పొద్దుతిరుగుడు ధాన్యం మార్కెట్ కమిటీలోని కొనుగోలు కేంద్రాల్లోనే మూలుగుతుండగా, గజ్వేల్ మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రోజు ల తరబడిగా కుప్పలుగా పోసి ఉన్నాయి.
ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఆవేదన చెందిన రైతులు గజ్వేల్ మా ర్కెట్ యార్డ్ వద్ద చౌరస్తాలో, అహ్మదీపూర్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు. గజ్వేల్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అం టూ నినాదాలు చేశారు. రోడ్డుపై వడ్లు పోసి వాటికి నిప్పంటించి నిరసన తెలపడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల ఆందోళన కారణంగా ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తమ పంటలను వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం స్పందించాలని రైతులు డిమాండ్ చేశారు. కాగా ఏడిఏ బాబు నాయక్, డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్, గజ్వేల్ సిఐ రవికుమార్ తదితరులు రైతులకు నచ్చజెప్పి నిరసనను విరమింప చేశారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అందాకూరు గ్రామ రైతులు ధాన్యం కొనాలని కుంటాల-కల్లూర్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం దండుపల్లి పాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శనివారం బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి పరిశీలించారు. రైతులకు ఏర్పడుతున్న ఇ బ్బందులను అడిగి తెలుసుకున్నారు. ధా న్యం కొనుగోలులో ప్రభుత్వం జాప్యం వహిస్తునందున రైతులు, కార్యకర్తలతో కలసి జాతీయ రహదారి 44 బైఠాయించి ధర్నాకు దిగారు.
దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్సై సుభా ష్‌గౌడ్ సిబ్బందితో కలిసి ధర్నాను చెదరగొట్టగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ధర్నా విరమణ చేయకుండా మొండిగా కూర్చోవడంతో కొద్దిగా తోపులాట జరిగింది. రెండు రోజుల్లో ధాన్యం తరలింపు పూర్తి కాకపోతే వెయ్యి మందితో జాతీయ రహదారి నిర్బంధం చేస్తామని ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. మండల పార్టీ అధ్యక్షుడు ఇమంపూర్ శేఖర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, అర్జున్, బిక్షపతి, సర్పంచి సాయి కుమార్ పాల్గొన్నారు.






