13 May, 2026 | 2:23 AM

హిమంత అనే నేను!

13-05-2026 01:22 AM
  1. అసోం సీఎంగా ప్రమాణ స్వీకారం
  2. మంత్రివర్గంలో నలుగురికి చోటు
  3. వేడుకకు హాజరైన ప్రధాని మోదీ

దిస్పూర్, మే 12: అసోం సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం గౌహతిలోని ఖానాపారా వెటర్నరీ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. హిమంతతో అసోం గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య పదవీ ప్రమాణ స్వీకారం  చేయించారు. సీఎంతోపాటు నలుగురు మంత్రులు బీజేపీకి చెందిన రామేశ్వర్ తేలి, అజంతా నియోమ్, ఏజీపీకి చెందిన అతుల్ బోరా, బీపీఎఫ్‌కు చెందిన చరణ్ బోరో అనే నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

శర్మ కేబినెట్‌లో 18 నుంచి 19 మందికి చోటు కల్పించాలని నిర్ణయించారు. దీంతో ఎన్డీయే వరుసగా మూడోసారి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, రెండోసారి సీఎంగా హిమంత ప్రమాణ స్వీకారం చేసినట్లయ్యింది. సీఎం ప్రమాణ స్వీకారం చేసిన ఖానాపారా వెటర్నీ కళాశాల మైదానంలో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తచ్చాడడంతో పోలీసులు అతన్ని తనిఖీ చేశారు. అతని వద్ద తూటాలు లభించగా అరెస్టు చేసి బసిస్ట పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు.

పాలకుడిని కాదు.. సేవకుడిని: సీఎం హిమంత..

ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రజలనుద్దేశించి భావోద్వేగంగా ప్రసంగించారు. తనను రెండోసారి ‘ముఖ్య సేవకుడు’గా ఎన్నుకున్నందుకు అసోం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గత పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని కొనియాడారు.

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, సేవ, సమర్పణ భావంతో మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. అలాగే మా కామాఖ్య దేవి, మహాపరుష్ శ్రీమంత శంకరదేవ్ ఆశీస్సులతో అసోంను మరింత ఉన్నత స్థానంలో నిలబెడతామని హిమంత పేర్కొన్నారు. తాను పాలకుడిని కాదని, సేవకుడినని సీఎం హిమంత అన్నారు. 

అసోం చరిత్రలో గొప్ప రోజు: ప్రధాని మోదీ..

ప్రమాణ స్వీకారం తర్వాత ప్రధాని మోదీ తొలుత నూతన సీఎం హిమంత బిశ్వ శర్మకు, కొత్త మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. అసోం చరిత్రలో ఇది  గొప్ప రోజు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం సంతోషకరమన్నారు.

హిమంత బిశ్వ శర్మను ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్‌గా అభివర్ణిస్తూ, ఆయన నాయకత్వంలో అసోం అభివృద్ధి పథంలో మరింత వేగంగా దూసుకుపోతుందని ఆకాంక్షించారు. అలాగే కొత్తగా బాధ్యతలు చేపట్టిన నలుగురు మంత్రులు రాష్ట్ర పురోభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.