13 May, 2026 | 2:59 AM

ఏఐఏడీఎంకేలో చీలిక

13-05-2026 01:20 AM
  1. విజయ్ సర్కార్‌కు షణ్ముగం వర్గం మద్దతు
  2. ౩౦ మంది ఎమ్మెల్యేలతో కలిసి సీఎంతో భేటీ
  3. అసెంబ్లీ బలపరీక్షలో టీవీకే వెంట నిలుస్తామని స్పష్టీకరణ

చెన్నై, మే ౧౨: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం విషయం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏఐఏడీఎంకే నిట్టనిలువునా చీలిపోయింది. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మంగళవారం సీవీ షణ్ముగం వర్గం ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. సుమారు ౩౦ మంది ఎమ్మెల్యేలతో కలిసి చెన్నైలో సీఎం విజయ్‌తో భేటీ అయింది.

ఈ సందర్భంగా షణ్ముగం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత, డీఎంకేతో పొత్తు పెట్టుకుందామని పళనిస్వామి పార్టీలో ప్రతిపాదన పెట్టారని, ఆ ప్రతిపాదనను తమ వర్గం వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. డీఎంకేకు వ్యతిరేకంగా ఉద్భవించిన పార్టీని, తిరిగి డీఎంకేలో విలీనం చేసేందుకు సిద్ధమవడం తమకు మనస్తాపం కలిగించిందని వెల్లడించారు. డీఎంకేతో పొత్తు అంటే ఏఐఏడీఎంకే అస్తిత్వాన్ని చంపేయడమేనని అభిప్రాయపడ్డారు.

అందుకే తమ వర్గం ప్రజాతీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నదని, అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో తమ వర్గం ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతుగా నిలుస్తారని కుండబద్దలు కొట్టారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఏఐడీఎంకేకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.