10-09-2025 12:40:34 AM
-నేను ఇక్కడే ఉంటా.. లైడిటెక్టర్ పరీక్ష చేసుకోవచ్చు
-గ్రూప్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలి
-జ్యుడిషియల్ కమిషన్ వేసి నిజాలు నిగ్గు తేల్చాలి
-బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): ‘నేను మళ్లీ చెప్తున్నా, ఫార్ములా -ఈ కేసు ఒక లొట్టపీసు కేసే’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో తాను ఇక్కడే ఉంటానని, ఎవరైనా వచ్చి లై డిటెక్టర్ పరీక్ష చేసుకోవచ్చని సవాలు విసిరారు. హైదరాబాద్‌కు ఫార్ములా -ఈ రేసు తీసుకురావడానికి తాను అన్ని ప్రయత్నాలు చేశానని చెప్పారు.
ఈ రేసు కోసం ప్రభుత్వం నుంచి రూ.46 కోట్లు ఇవ్వాలని తానే ఆదేశాలు ఇచ్చానని, ఆ డబ్బులు నేరుగా నిర్దేశిత ఖాతాలోకి చేరాయని వివరించా రు. ఇందులో రూపాయి కూడా ఎక్కడా తారుమారు కాలేదని, ప్రతి రూపాయికి లెక్క ఉందని, అలాంటప్పుడు అవినీతి ఎక్కడిదని ప్రశ్నించా రు. ప్రాసిక్యూషన్ చేసినా, చార్జిషీట్లు వేసినా ఏమీ చేయలేరని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, గ్యారెంటీల అములుకు పోరాడుతామని పునరుద్ఘాటించారు.
‘సీఎం, నేను ఇద్దరం కలిసి లై డిటెక్టర్ పరీక్ష ను టీవీ చానల్ ముందు ఎదుర్కొందాం’ అని సవాలు విసిరారు. గతంలో రూ.50 లక్షల నోట్ల కట్టలతో కెమెరాలకు అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి గురించి కూడా ప్రజలు తెలుసుకుంటారని అన్నారు. ఈ పరీక్షతో ఎవరు ఏమిటో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.
ప్రజాసమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి ప్రభుత్వం ఫార్ములా -ఈ కేసును ముందుకు తెచ్చిందని ఆరోపించారు. కానీ తాము మాత్రం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని స్పష్టంచేశారు. గ్రూప్ మెయిన్స్ రీవాల్యుయేషన్ చేసినా నిరుద్యోగ అభ్యర్థులకు నమ్మకం కలగదని, వారికి భరోసా కలగాలంటే మరోసారి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
గ్రూప్ తప్పు ఎక్కడ జరిగింది? పోస్టులను ఎవరు అమ్ముకున్నారో బయటికి రావా లంటే జ్యుడిషియల్ కమిషన్ వేయాలని పేర్కొన్నారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి లేదంటే విశ్రాంత జడ్జితో కమిషన్ వేయాలని డిమాండ్‌చేశారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగొద్దంటే జ్యుడిషియల్ కమిషన్ వేసి నిజాలను నిగ్గు తేల్చాలని సూచించారు.