10-09-2025 12:51:04 AM
రంగారెడ్డి,సెప్టెంబర్ 9: రంగారెడ్డి జిల్లా రైతులకు ప్రస్తుతం రీజనల్ రింగ్ రోడ్డు గుబులు పట్టుకుంది. ఎక్కడ తమ భూము లు పోతాయోనని దిగులు చెందుతున్నారు. బడా రైతులను వదిలేసి బక్క రైతులను బలిచేస్తారా? అని కారాలు... మీరాలు నూరుతు న్నారు. దక్షిణ తెలంగాణలో ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణం కోసం భూములకు సంబంధించి కొత్త అలైన్ మెంట్ ను హెచ్‌ఎండీఏ అధికారులు ఖరారు చేస్తూ ఇటీవల సర్వే నెంబర్ల వారిగా ప్రకటించారు.
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలను కలుపుకొని 10 మండలాలు 44 గ్రామాల్లో మొత్తం భూసేకరణ అధికారులు చేపట్టనున్నారు. ఉత్తర భాగంలో భాగంగా 161 కిలోమీటర్లు... దక్షిణ భాగంలో 201 కిలోమీటర్లు రోడ్డును ఆరు వరుసలు, వంద మీటర్లతో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం దక్షిణభాగం రోడ్డుకు దాదాపు 2,010 హెక్టార్ల భూసేకరణ కోసం అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు.
రైతులకు కునుకు కరువు
రీజినల్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ చేపట్టేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు రెవెన్యూ గ్రామాల్లోని భూములు కోల్పోయి సర్వేనెంబర్లతో కూడిన జాబితాను ప్రకటించారు. ఇట్టి వార్త చెవిలపడ్డ ప్పటి నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతన్న లకు కంటికి కునుకు కరువైందని చెప్పాలి.
రింగ్ రోడ్డులో భూములు కోల్పోయే మెజార్టీ రైతులు ఒక గుంట మొదలుకొని పది ఎకరాల లోపు రైతులే ఉంటారు. తాతల నాటి నుంచి వంశపారపర్యంగా భూమిని నమ్ముకొని వ్యవసాయమే ఆదేరువుగా చేసుకొని బతుకుతున్న చిన్న, సన్నకారు రైతులంతా రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతే తాము బతికేది ఎట్లా అంటూ పలువురు రైతన్నలు కంటతడి పెట్టుకుంటున్నారు.
10 మండలాల మీదుగా రింగ్ రోడ్డు
రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లాలను కలుపుకొని మొత్తం పది మండలాలు, 44 గ్రామాల మీదుగా రీజినల్ రింగ్ రోడ్ పోతుంది. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లో మాడుగుల మండలంలోని అన్నే బోయిన్పల్లి, బ్రాహ్మణపల్లి, ఇర్విన్, కలకొండ, ఆమనగల్ మండలంలోని సింగం పల్లి, పోలేపల్లి,మాలేపల్లి, చింతలపల్లి, తలకొండపల్లి మండలంలో గౌరిపల్లి,ఖానాపూర్ మెదక్ పల్లి,రాంపూర్, వెంకటరావుపేట్,నల్లరాళ్ల తండా, చంద్రదాన,జూలపల్లి గ్రామాలు ఉన్నాయి.
షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలో నిడద వెళ్లి, తొమ్మిది రేకుల, పరుఖ్ నగర్ మండలంలో భీమా రం, చించోడు, కొందుర్గు మండలంలో ఆగిర్యాల, చెరుకుపల్లి, తంగేళ్లపల్లి, వనంపల్లి గ్రామాలు. వికారాబాద్ జిల్లా లో మోమిన్పేట్ లో దేవరంపల్లి,టేకులపల్లి, నవాబుపేటలో చించోల్ పేట్, చిట్టి గూడ, దాతాపూర్, వట్టిమినపల్లి, యావపూర్, పూడూరు మండలంలో గంగుపల్లి, ఘాటుపల్లి, కర్వేలి,మాన్చన్పల్లి మన్నెగూడ,పూడూరు, రాం చెర్ల, సీర్గాయి పల్లి,తుర్క ఎంకపల్లి, ఎనుకపల్లి వికారాబాద్ లో బార్వాన్ పల్లి, పీరంపల్లి,పుల్పుమామిడి గ్రామాలకు చెందిన రైతులు భూములు కోల్పోనున్నారు.
బీఆర్‌ఎస్ హయాంలోనే..
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం పై చురుకుగా కసరత్తులు ప్రారంభమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో ఆరు మండలాలు 26 రెవెన్యూ గ్రామాలు, వికారాబాద్ జిల్లాలో గ్రామాల వారిగా ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్ హెచ్‌ఎండి జారీ చేసింది. గ్రామాలు సర్వే నెంబర్ల వారీగా రూట్ మ్యాప్ ను స్పష్టంగా విడుదల చేసి... రైతులు ఏమైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఈనెల 15 వరకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసేందుకు గడువు ఇచ్చింది.
దీంతో ఆయా గ్రామాల రైతులంతా హైదరాబాదులోని హెచ్‌ఎండీఏ కార్యాలయం బాట పట్టారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు రావడం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణలో కొంత జాప్యం ఏర్పడింది. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో భూసేకరణ చేపట్టి టెండర్ల ను సైతం పిలిచారు.
బక్క రైతులను బలిచేస్తారా?
గత వారం రోజుల నుంచి బాధిత రైతులంతా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లను కలిసి రైతులు మొరపెట్టుకుంటున్నారు. బతుకుదెరువు కల్పించే భూమాతను కోల్పోతే మేము బతుకుడు ఎట్లా సారు అంటూ ఎమ్మెల్యేల ను తమ బాధను వెళ్ళగకుతున్నారు. గతంలోనే మాడుగుల మండలంలో కల్వకుర్తి ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టుకు సంబంధించి భూములను కోల్పోయాం ఇప్పుడు మళ్లీ ట్రిపుల్ ఆర్ రాకతో ఉన్న భూములు కోల్పోవాల్సిన దుస్థితి తమకు ఏర్పడుతుందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
బాధిత ఎమ్మెల్యేలతో పాటు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, హైదరాబాదులోని హెచ్‌ఎండిఏ కార్యాలయాలకు తరలి వెళ్లి తమ సమస్యలతో కూడిన విన్నతులు అందజేస్తున్నారు. పాత అలైన్మెంట్ లోనే రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. బడా రైతులను కాపాడుతూ.. బక్క రైతులను బలి చేస్తారంటూ రైతులు దీనంగా ఎమ్మెల్యేలను అధికారులను వేడుకుంటున్నారు.
మరికొందరు రైతులు తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ భూములకు సంబంధించి నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారంటూ హెచ్‌ఎండిఏ కార్యాలయానికి వెళ్లి నిరసనకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చే పరిస్థితి లేదని బలవంతంగా ప్రభుత్వం భూములు గుంజుకుంటే తమ భూములను కాపాడుకునేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలను కొనసాగిస్తామని మరికొంద రైతులు హెచ్చరించారు.
ప్రస్తుతం ఆయా గ్రామాలలో భాదిత రైతులంతా ఒక జేఏసీగా ఏర్పడి మండలాల్లో నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారు. చూడాలి మరి రీజినల్ రింగ్ రోడ్ పై రైతన్నలను ప్రభుత్వం ఎలా బుజ్జగిస్తుందో వేచిచూడాల్సిందే.