calender_icon.png 7 December, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా అమ్మతో చెప్పి వచ్చేశా.. పెద్దకొడుకు లేడనుకొమ్మని!

07-12-2025 12:34:00 AM

జీవితంలో సినిమా ఒక భాగం అనుకునేరే చాలామంది. కానీ, ఈయన మాత్రం సినిమానే జీవితం అనుకున్నాడు. చిత్రపరిశ్రమలో గెలిచిన తర్వాతే వస్తా.. అప్పటిదాకా ముగ్గురిలో ఓ కొడుకు లేడనుకొని బతకమని తల్లిదండ్రులకు చెప్పేసి, హైదరాబాద్ బస్సెక్కేశాడు. అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. అడుగడుగున అవమానాలు 

ఎదురైనా ఆభరణాలుగా అంగీకరించాడు.. ఛీత్కారాలన్నీ సత్కారాలేనని స్వీకరించాడు. కట్ చేస్తే మొదటి సినిమాతోనే దర్శకుడిగా ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నాడు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ డైరెక్టర్ సాయిలు కంపాటి తన జర్నీ గురించి ‘విజయక్రాంతి చెప్పిన ముచ్చట్లు ఆయన మాటల్లోనే... 

మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు దగ్గర్లోని కొమరారం. నా పేరు జగదీష్ చంద్రబోస్. ఊళ్లో ఫ్రెండ్స్ అంతా జగదీష్ అంటారు. సినిమా సర్కిల్‌లో బోస్ అని పిలుస్తారు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ స్టోరీని ప్రొడ్యూసర్లకు చూపించడానికి ఓ డెమో తీసే టైమ్‌లో మా తాత చనిపోయాడు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఇదే విషయం వేణు ఊడుగులకు చెప్తే.. మా తాత పేరునే నాకు స్క్రీన్‌నేమ్‌గా మార్చారు. అలా ‘డైరెక్టర్ సాయిలు కంపాటి’గా ప్రేక్షకులకు పరిచయమయ్యా. 

మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. కొంత పొలం ఉంది. దాన్ని అమ్మానాన్నలు సాగుచేస్తారు. ముగ్గురం అన్నదమ్ములం. ఇంటికి పెద్దోన్ని.. ఏదో ఒకదాంట్లో సెటిల్ అయితే పెళ్లి చేద్దామనుకుంటే, ఏదో సినిమాలు అనుకుంటూ తిరుగుతున్నాడని మా అమ్మ బాధపడేది. ఇవన్నీ నాకు చెప్పి, నన్ను బాధపెట్టడం ఇష్టంలేక చేనులో పని చేయడానికి వచ్చినవాళ్లతో చెప్పుకునేదట. అది తెలిసిన తర్వాత తమ్ముళ్లిద్దరికీ పెళ్లి చేసేయమని చెప్పేశాను. నేను పెళ్లి చేసుకోను.. అసలు పెద్ద కొడుకు లేడనుకోని బతకమని, నేను గెలిచివస్తే అప్పుడు పెళ్లి చేయమని చెప్పేశాను.  

సర్కారు నౌకరీ కాల్ లెటర్ చించేసి.. 

బీటెక్ అయిపోయిన తర్వాత అమ్మానాన్నల కోసం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యాను. పోటీ పరీక్ష రాస్తే ఎంపికయ్యాను. కాల్ లెటర్ వచ్చింది. నాకేమో సినిమాల్లోకి రావాలని కోరిక. అందుకే ఎవరికీ తెలియకుండా కాల్ లెటర్‌ను చించేసి, ఏమీ తెలియనట్టు ఉన్నా. ఇప్పటివరకు ఈ విషయం ఆ కాల్ లెటర్ నా దగ్గకు తెచ్చిన వ్యక్తికి, నాకే తెలుసు. 

ఊరికి వెళ్తే హేళన చేసేవారు.. 

ఒక లక్ష్యం కోపం వెళ్తున్నప్పుడు సాధిస్తామో.. లేదో తెలియని పరిస్థితుల్లో జనం మనల్ని చాలా హీనంగా చూస్తారు. హైదరాబాద్ నుంచి ఎప్పుడైనా మా ఊరికి వెళ్తే నన్ను చూసి ‘పూరీ జగన్నాథ్ వస్తాండు.. రాజమౌళి వస్తాండు..’ అనుకుంటూ హేళన చేసేవారు. అయితే, వాళ్లను తప్పు పట్టలేం! ఎందుకంటే మా ఇంట్లో, ఊళ్లోవాళ్లెవరూ సినిమాల్లో లేరు.. చుట్టుపక్కల ఊళ్లల్లో కూడా ఉండేవారు కాదు. ఆ మారుమూలన నేనొక్కన్నే సినిమాలు అంటూ తిరగడం వల్లే ఈ ఈసడింపులు! మా దోస్తులు కూడా ఇది అయ్యేదేనా? వీడితో అవుతుందా? అని చిన్నచూపు చూసేవారు. 

సినిమా ఫీల్డ్‌లోనూ అవమానాలు..

ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. ఎవరు కావాలి? ఎక్కడి నుంచి వచ్చావ్? ఎందుకొచ్చావ్? ఇలా డైరెక్టుగా వచ్చేడమేనా?.. అంటూ చాలా భయపెట్టేవారు. మళ్లీమళ్లీ వెళ్తే రావొద్దని చెప్పాం కదా అంటూ కసురుకునేవారు. అవకాశాలు లేకనో, అన్నం లేక ఆకలితోనో కాదు.. చుట్టూ ఉండే మనుషుల కలుపుకొనిపోకపోవటం వల్ల బాధపడ్డ సందర్భాలెన్నో! పల్లెటూరి నేపథ్యం నాది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెద్దగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిపడ్డాను. నేను మాట్లాడే తీరు వాళ్లకు నచ్చేది కాదు.

అలాంటి వాళ్ల మధ్య ఉండలేక రెండు గదులు మారాల్సి వచ్చింది. ఏదో ఒక రకంగా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు జూనియర్ ఆర్టిస్ట్‌గా చేద్దామని ఫిక్స్ అయిన. కృష్ణానగర్‌లో జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్లడానికి ఓ బస్సు వస్తుంది.. దాంట్లో ఎక్కా. అప్పటికే బస్సు నిండిపోయింది. ‘నువ్వు అవసరం లేదు’ అని నన్ను దింపేశారు. ఇంకోపారి ఓ సినిమాకు పనిచేయడానికి వెళ్లినప్పుడు భోజనాల దగ్గర ఇష్యూ అయింది. ‘ఎవరు నువ్వూ.. ఎవరి ద్వారా వచ్చావ్.. నీ కార్డు ఏదీ?’ అని అడుగుతుంటే అవమానంగా ఫీల్ అయ్యా.. ప్లేట్ అక్కడే పడేసి తినకుండా వచ్చేశా.

ఇలాంటి అవమనాలన్నీ భరించడం అలవాటు చేసుకొని, సినిమా మీద ఇష్టంతో చాలా మంది దగ్గర పనిచేశా. సంగీత దర్శకుడు చక్రి నన్ను ప్రోత్సహించారు. ఇక దారి దొరికిందని సంబరపడేవాన్ని. కానీ, దురదృష్టవశాత్తు కొన్ని రోజులకే ఆయన చనిపోయారు. అలా నాకు మళ్లీ ఆదరణ కరువైంది. చివరిగా వేణు ఊ డుగుల పరిచయమయ్యారు.. దాని ఫలితమే, మూడో వారం కూ డా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల ‘రాజు వెడ్స్ రాంబా యి’ సినిమా డైరెక్టర్‌గా మీ ముందు నిల్చునే అవకాశం. 

ఒకేఒక్క రూపాయి కోసం రూమ్ అంతా వెతికి..  

అప్పుడు ‘ఆర్‌ఎక్స్ 100’ విడుదలైన వారం.. ఆ సినిమాకు మాంచి వైబ్ ఉంది. ఎలాగైనా ఆ సినిమా చూడాలని నా కోరిక. టికెట్టుకు ఇరవై రూపాయిలు కావాలి. జేబులు తడుముకుంటే డబ్బుల్లేవు. రూమ్‌లో చిల్లర కనిపిస్తే హమ్మయ్య అనుకున్నా. తీరా లెక్కేస్తే పందొమ్మిది రూపాయలే ఉన్నాయి. ఇంకొక్క రూపాయి కావాలి.. ఆ ఒక్క రూపాయి కోసం ఇంకా దేవులాట మొదలుపెట్టిన. రూమ్ అంతా తిర్రమర్రేసినా ఆ రూపాయి దొరకలే. అలా అప్పుడు ఆ సినిమా చూడలేకపోయా. 

చిన్నప్పుడు మా నాన్న నన్ను ఎక్కువగా సినిమాలకు తీసుకెళ్లేవాడు. ఏదైనా సినిమా చూసి వస్తే అందులో హీరో చెప్పే డైలాగులను నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆయలాగే చెప్తూ ఆనందపడేవాన్ని. అలా ఆరో తరగతి చదివేటప్పుడు మిమిక్రీ చేయడం అలవాటైంది. సాధారణంగా అందరూ హీరోహీరోయిన్ పేర్లే గుర్తుపెట్టుకుంటారు. కానీ నేను పేపర్‌లో సినిమా వార్తలు చదివేటప్పుడు క్యాస్ట్ అండ్ క్రూ వివరాలన్నీ చదివి గుర్తుపెట్టుకునేవాన్ని.

ఏ థియేటర్‌లో ఏ సినిమా ఆడుతుందో లిస్టు రోజూ చెక్ చేసేవాన్ని. ఏ సినిమా గురించి అడిగినా రిలీజ్ డేట్, నటీనటులు, దర్శకనిర్మాతలు, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్.. ఇలా అన్నీ టకాటకా చెప్తుంటే క్లాస్‌మేట్స్ ఆశ్చర్యపోయేవారు. అంతేకాకుండా ఏ హీరోకు ఏ టైటిల్ సెట్ అవుతుందో ఊహించుకునేవాన్ని. ఆ తర్వాత ఆ టైటిల్‌కు తగ్గట్టు నాకు తెలిసిన పద్ధతిలో చిన్నచిన్న స్టోరీలు అల్లుతూ, రాసిపెట్టేవాన్ని.