3 March, 2026 | 3:34 PM

శాంతిఖనిలో ఆర్ఓ ప్లాంట్‌కు సుస్తీ

03-03-2026 01:49 PM
  1. తాగు నీటికి అల్లాడుతున్న కార్మికులు..
  2. కొత్తది మంజూరైన ఏర్పాట్లకు గ్రహణం 
  3. అక్కడ అధికారులు ఉన్నట్టా.. లేనట్టా?
  4. ఇంటి నుంచి వాటర్ బాటిళ్లతో కార్మికులు

బెల్లంపల్లి,(విజయక్రాంతి): సింగరేణిలో యాజమాన్యం(Singareni Management) స్థానంలో ఉన్న అధికారుల్లో జవాబుదారితనం, అలనా పాలన గాడి తప్పింది. అధికారుల నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం సింగరేణి కార్మికులకు శాపంగా పరిణమించింది. అందుకు సాక్ష్యంగా మందమర్రి ఏరియా పరిధిలోని బెల్లంపల్లి శాంతిఖని బొగ్గు బాయిలో(Shanthikhani Coal Mining) కార్మికులకు తాగేందుకు గుక్కెడు నీరు కరువైంది. ఎప్పుడో నిర్మించిన ఆరో ప్లాంట్ చెడిపోయింది.

కొత్త ప్లాంట్ మంజూరైన దాని నెలకొల్పేందుకు అధికారుల నిర్లక్ష్యంతో గని కార్మికుల గొంతు ఎండుతుంది. క్యాంటీన్ ముందు నెలకొల్పిన ఆర్ఓ ప్లాంట్ కాలం చెల్లిపోయింది. ఆర్వో ప్లాంట్ చెడిపోయి గత కొన్ని నెలలు గడిచిపోతున్నది. కార్మికులు తాగునీటి సదుపాయం లేక నరకాయతన పడుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఇంటి నుంచి కార్మికులు వాటర్ బాటిళ్లను వెంట తెచ్చుకుని దప్పిక తీర్చుకుంటున్నారు.

ముందే హెచ్చరించిన సోయిలేదు..

ఆరో ప్లాంట్ పరిస్థితిని కార్మికులు ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే వారి విజ్ఞప్తులను సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. అరకొరగా ఏర్పడిన తాగునీటి కొరత  అధికారుల దృష్టి కివెళ్ళినా.. పట్టించుకున్న పాపను పోలేదని విమర్శలు ఉన్నాయి. ఆ నిర్లక్ష్యం వల్లే  ఆరో ప్లాంట్ చెడిపోయింది. తాగునీరు రెండు రోజుల క్రితం నుంచి నిలిచిపోయింది. ఆర్వో ప్లాంట్ మొత్తంగా పనికి రాకుండా మూలకుపడే వరకూ గని అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించారు. దాని ఫలితంగా గనిలో ప్రస్తుతం తాగునీటి కొరత ఏర్పడింది.

అధికారులు  ముందే మేలుకుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని కార్మికులు వాపోతున్నారు. శాంతిఖని లో పరిపాలన స్థానాలు ఉన్న అధికారుల పనితీరు పై మరోసారి కార్మికులు మండిపడుతున్నారు. అక్కడ పనిచేస్తున్న ప్రధాన కార్మిక సంఘాల డెలిగేట్లు కూడా ఏం చేస్తున్నారనే విమర్శలు  వినిపిస్తున్నాయి. అధికారుల మాదిరే, వారు కూడా నిర్లక్ష్యంగా ఉండిపోయారనే విమర్శలను మూటకట్టుకున్నారు. కనీస అవసరాలను తీర్చే దుస్థితిలో గని అధికారులు, కార్మిక సంఘాలు లేరంటే? పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమౌతుంది. అధికారుల పట్టింపులేని త నానికి ఇంతకుమించిన సాక్ష్యం మరొకటి అక్కరలేదు. శాంతిఖని మనుగడకోసం రక్షణ, సంక్షేమం, ఇతర రంగాలకు ప్రత్యేకంగా అధికారులు ఉన్నారు.

ఏ రంగంలో ఏ సమస్య వచ్చినా ఆ రంగానికి చెందిన అధికారి తొలుత స్పందించడం వారి నైతిక బాధ్యత. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వారి ప్రధాన విధి. కాగా మూల విధులను ఆయా రంగాల అధికారులు విస్మరించి కార్మికులను అష్ట కష్టాలు పెడుతున్నారునీ విమర్శలు ఉన్నాయి. గనిలో కనీసం తాగునీటిని కూడా అందించలేని దౌర్భాగ్యం స్థితిలో అధికారులు ఉన్నారంటే.. శాంతిఖనిలో అధికారుల పనితీరు ఎంత లోప భూయిష్టంగా ఉందో అర్థమవుతుంది. అంటే అక్కడ అధికారుల పనితీరు యమునా తీరం అన్నట్టుగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ తాత్కాలికంగా అయినా తాగునీటి వసతిని ఏర్పాటుచేద్దామన్న యోచన కూడా చేయకుండా చోద్యం చూస్తున్నారు.

దీంతో తాగునీటికి అనునిత్యం కార్మికులు అల్లాడిపోతున్నారు. అధికారుల్లో కాసింత మానవత్వం, కనికరం లేకుండాపోయిందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కార్మిక సంఘాల నేతలు కూడా అధికారులకేమికి తక్కువకాదని నిరూపించుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇప్పటికైనా అధికారులు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుపై దృష్టి సారించాలి. అప్పటివరకూ తాత్కాలిక తాగునీటి సౌకర్యం కల్పించాలి. అందుకు తగిన ఏర్పాట్లకు తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.