కృష్ణ గారికి గర్వంగా చూపించేవాడిని
14-06-2024 12:05 AM
యాక్షన్ సినిమాలకి సరిగ్గా సరిపోయే కటౌట్ హీరో సుధీర్ బాబు సొంతం. అయితే ‘కొట్టడానికి కండ కాదు.. కథ కావాలి’ అనే సిద్ధాంతం ఆయనది. ఆ కారణంతోనే ‘సమ్మోహనం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి సున్నితమైన కథల్లోనూ కనబడిన సుధీర్, ‘హరోం హర’ రూపంలో తను కోరుకున్న కథ దొరకడంతో “ఇంక సెప్పేదేం లేదు సేసేదే” అంటూ బరిలోకి దిగిపోయారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌లో ఆయన నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘హరోం హర’ గురించి సుబ్రహ్మణ్యం అలియాస్ సుధీర్ పంచుకున్న సంగతులు..
- దర్శకుడు జ్ఞానసాగర్ ఈ కథ చెప్పే సమయానికి ఆయన తొలి సినిమా ‘సెహరి’ నేను చూడలేదు. ఏదో ప్రేమకథ చెప్తాడనుకుంటే, ఈ కథ చెప్పాడు. వినగానే చేయగలడన్న నమ్మకం కలిగింది. ఎందుకంటే.. తనది కాని కథతోనే తొలి సినిమా అంత బాగా చేశాడు. ఈ కథ ఆయన పుట్టి పెరిగిన చోటుకి సంబంధించినది. ఆ కాలంలో తను చూసిన ప్రపంచాన్ని తెరపై చూపించాలనుకున్నాడు. నావరకు నేను దర్శకుడికి వందకి వంద మార్కులు వేస్తా.
- కమర్షియల్ సినిమాలు చాలా వరకు ఒకే రీతిన సాగుతుంటాయి. అయితే ప్రత్యేకించి ఒక కథని చెప్పాలనుకున్నపుడు ఆ ప్రపంచంలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఈ సినిమా ఇలా కనపడటం ప్రేక్షకులను సుబ్రహ్మణ్యం ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికే. యాస కోసం కొంత సాధన చేశాను. కానీ, అది నాకేం సమస్య అనిపించలేదు. చిన్నప్పటి నుంచి నేను హాస్టల్‌లోనే పెరిగాను. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల వ్యక్తులతోనూ కలిసి పెరిగాను. తెలుగులోనూ అన్ని యాసలతో కొంత పరిచయం ఉంది.
- ఇలాంటి కథలు చేయాలంటే తెరపై కనపడే పాత్ర మనలో ఒకరని ప్రేక్షకులు అనుకోవాలి. అప్పుడే ఆ పాత్రలో ఏం చేసినా వారు తమదిగా భావిస్తారు. ఇంకా చెప్పాలంటే.. ఈ సినిమా కొత్త హీరో చేసినా జనాలకు నచ్చుతుంది. కథ విన్ననాటి నుండి నాకు అనిపించినది ఒక్కటే.. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటివరకూ సినిమా రాలేదు. ఎన్ని అంచనాలతో వచ్చినా ఈ సినిమా నిరాశ పరచదు. ఖచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇది.
- అంతర్లీనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి కూడా ఉంటుంది. ఊరిలో ఉన్న ఒక సమస్యని ఒక వ్యక్తి వచ్చి తీరుస్తాడు. అది దేవుడి వల్ల జరిగిందా? వ్యక్తి వలనా? అన్నది చూసే వారిని బట్టి ఉంటుంది. ఈ సినిమా అన్ని విషయాల్లోనూ కొత్తగా అనిపించింది. చిత్రీకరతో సహా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్.. ప్రతీది. ఇలా ఇప్పటివరకు నాకైతే జరగలేదు. గతంలో ప్రేమకథా చిత్రాలకు పనిచేసిన చైతన్ భరద్వాజ్ ఒరిజినల్ ఏమిటన్నది ఈ సినిమాతో తెలుస్తుంది. ఇలాంటి సినిమాకి సంగీతం చేయాలంటే అది లోపలి నుండి రావాలి. సుబ్రహ్మణ్యం గుర్తిండిపోయేలా ఉంటుంది. అందులో నేపథ్య సంగీతం పాత్ర కీలకం.
- వాస్తవానికి ‘సమ్మోహనం’ సినిమా ఈ నిర్మాతలే చేయాల్సింది. అప్పుడు ఏవో కారణాల వల్ల కుదరలేదు. హీరో మార్కెట్ కంటే స్టోరీ మార్కెట్‌ని నమ్మి చేశారు. సినిమా ఈ స్థాయిలో ఉందంటే వారే కారణం. ‘హరోం హర’ సీక్వెల్‌కి అవకాశం ఉంది. ఐడియా కూడా సిద్ధంగా ఉంది. అది ఏ స్థాయిలో చేయాలన్నిది సినిమాకి వచ్చే స్పందన మీద ఆధారపడి ఉంది.
- సినిమాలు చేయడంలో నేను ఫెయిల్ కాలేదు. అయితే వాటిని జనాలకు చేరవేయడానికి ఏం చేయగలమన్నది తెలుసుకుంటుంటాను. ఫలితాలు మారినపుడు కూడా నేను ఆ సందర్భం నుండి వీలైనంత తొందరగా బయటపడే ప్రయత్నం చేస్తాను. అప్పుడే తర్వాతి పనులు సరిగ్గా చేయగలమని నమ్ముతా.
- కృష్ణ గారు నా సినిమాలు చూసినప్పుడల్లా బాగున్నాయని చెబుతూనే, యాక్షన్ సినిమాలు చేయమని చెప్పేవారు. అదే మాట కుటుంబ సభ్యులతోనూ చెప్పించేవారు. నాకు ఆయన ఉద్దేశ్యం అర్థమయ్యేది కానీ, ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నేను కథలు ఎంపిక చేసుకునేవాడిని. ఆయన ఉండుంటే ఈ సినిమా గర్వంగా చూపించేవాడిని.






