పెళ్లికి బాజా మోగింది!
బాలీవుడ్ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా పెళ్లిపీటలు ఎక్కనుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఈ భామ పెళ్లి గురించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్‌తో ఈ ముద్దుగుమ్మ కొంత కాలంగా ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ జంట ఈ నెల 23న వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారట. ఈ వార్తకు మరింత బలం చేకూరుస్తూ ఓ వెడ్డింగ్ కార్డు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తోంది. ఓ మ్యాగజైన్ కవర్ పేజీలాగా డిజైన్ చేసి ఉన్న ఈ వెడ్డింగ్ కార్డు అందరూ చదివేలా చేస్తోంది. ఈ జంటకు సంబంధించిన ఓ రొమాంటిక్ ఫొటో ఈ కార్డుపై ఆకర్షణీయంగా ఉంది. క్యూఆర్ కోడ్ ద్వారా యాక్సెస్ చేయగల ఓ డిజిటల్ ఇన్విటేషన్ కార్డు ఇది.
“ఈ వెడ్డింగ్ కార్డును నిజంగా మేమే రూపొదించాం. ఈ రొమాన్స్ కూడా వాస్తవమే. జూన్ 23న రాత్రి 8 గంటలకు ‘బాస్టియన్ ఎట్ ద టాప్’కు వచ్చేయండి. ఫార్మల్, ఫెస్టివల్ డ్రెస్ కోడ్ పాటించండి. ఎరుపు రంగు దుస్తులు ధరించవద్దు’ అని ఈ కార్డులో రాసి ఉంది. ఈ కార్డులో వెడ్దింగ్ వెన్యూగా పేర్కొన్న ‘బాస్టియన్ ఎట్ ద టాప్’ అనేది ముంబయి శివారులోని ఓ విలాసవంతమైన రెస్టారెంట్ కాగా, సోనాక్షి సిన్హా మాత్రం తన పెళ్లి వార్తలపై స్పందించడానికి నిరాకరించింది. తన తల్లిదండ్రులు కూడా ఇంతలా అడగటం లేదని, సమయం వచ్చినప్పుడు తానే అన్ని విషయాలూ వెల్లడిస్తానని చెప్తోంది. సోనాక్షి, జహీర్ ‘డబల్ ఎక్స్‌ఎల్’ చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమా సెట్స్‌లోనే వీరి మధ్య ప్రేమ చిగురించిదని, గత ఏడాది కాలంగా ఈ జంట సహజీవనం చేస్తోందని బాలీవుడ్ వర్గాల టాక్. సోనాక్షి ఇటీవల ‘హీరామండి’ సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే.






