ఆయన్ను ముందు నేనే అడిగా..
వడ్డే జిష్ణు సమర్ఫణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. ఈ సినిమాతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్‌కు జోడీగా రాశీసింగ్ నటించారు. జూన్ 19న రిలీజ్ కానున్న ఈ చిత్ర విశేషాలను హీరోయిన్ రాశీసింగ్ మీడియాతో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
* నాకు సినిమాలు, వ్యాపారాలు రెండూ ఇష్టం. నేను ఇంకా ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఇదంతా కూడా నథింగ్. 14 ఏళ్లకే మోడలింగ్ ప్రారంభించా. నేను ఛత్తీస్‌ఘడ్‌లోని భిలాయ్ నుంచి వచ్చిన అమ్మాయిని. మిస్ చత్తీస్‌ఘడ్ పోటీలో రెండో స్థానంలో నిలిచా.. పేపర్‌లో నా ఫోటో పడటంతో ఆ విషయం మా ఇంట్లో వాళ్లకు తెలిసింది.
నాకు చదువుల్లో అంతగా ఆసక్తి ఉండేది కాదు. అలా మెల్లిగా ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్ ప్రారంభించా. ఇప్పుడు సినిమాలు, వ్యాపారాల్లో బిజీగా ఉన్నా. వడ్డే నవీన్ నా ఇతర వ్యాపకాల గురించి అడిగేవారు. నాకున్న రెస్టారెంట్, కెఫే వ్యాపారాల గురించి చెప్తే ఆశ్చర్యపోయారు. నాకు ఫుడ్, కాఫీ అంటే చాలా ఇష్టం. అందుకే ఆ బిజినెస్ పెట్టా. నా బ్రదర్ హోటల్ మేనేజ్‌మెంట్ చేశారు. అతని సలహాలు కూడా తీసుకున్నా.
* ఈ చిత్రంలో వడ్డే నవీన్ భార్య పాత్రలో నటించా. కుటుంబం చుట్టూ తిరిగే కథే అయినా నా పాత్ర కంప్లీట్ మదర్ పాత్రలా ఏమీ ఉండదు. పక్కింటి అమ్మాయిలా ఎంతో సహజంగా ఉంటుంది. మేకప్ వేసుకోకుండా నటించా. భర్తకు ప్రతీ విషయంలో సపోర్ట్‌గా ఉండే ఓ చక్కటి గృహిణిగా లక్ష్మి పాత్ర ఉంటుంది. నేను రియల్ లైఫ్‌లో కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటా. లక్ష్మీ పాత్రను పోషించడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో ఇదొక విభిన్నమైన పాత్రవుతుంది.
* షూటింగ్ టైమ్‌లో నాకు పూర్తి కథ తెలియదు. నా సీన్స్ వరకే కథ చెప్పారు. సినిమా చూసిన తర్వాత ఆశ్చర్యపోయా. నవీన్ చాలా సర్‌ప్రైజ్ చేస్తారు. నా పాత్ర తెరపై చక్కగా అనిపించింది. వంద శాతం న్యాయం చేశానని అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ చూశాక సినిమా అద్భుతంగా అనిపించింది. ఇదొక మంచి చిత్రంగా నిలుస్తుంది.
* వడ్డే నవీన్‌తో సినిమా అని తెలిశాక ఆయన గురించి చాలా రీసెర్చ్ చేశా. ఆయన నటించిన ఎన్నో చిత్రాల గురించి తెలుసుకున్నా. ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చారని అందరి కంటే ముందుగా నేనే ఆయన్ను అడిగా (నవ్వుతూ). ఆయన చాలా ఇంటలెక్చువల్. ప్రపంచంలో ఏ విషయం గురించి అడిగినా బోలెడంత సమాచారం ఇస్తారాయన. కానీ సోషల్ మీడియా అంటే మాత్రం పారిపోతారు. ఆయనకు ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేయించాలని చాలా ప్రయత్నించా.
* రకరకాల పాత్రలు, డిఫరెంట్ కంటెంట్ ఉన్న చిత్రాల్ని చేయాలని చూస్తున్నా. గ్లామర్ అయినా, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ అయినా సరే నేను నటించేందుకు సిద్ధంగానే ఉన్నా. ప్రస్తుతం ‘గాసిప్’ అని ఓ ప్రాజెక్ట్ ఓటీటీ కోసం చేశా. ఇంకా కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.






