17 August, 2026 | 3:15 AM

నేను ఖమ్మం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తా

17-08-2026 12:08 AM
  1. తుమ్మల అరాచకాలను ప్రోత్సహిస్తున్నారు..
  2. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం టౌన్, ఆగస్ట్ 16 (విజయ క్రాంతి): ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని, నేను ఖమ్మం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.  గతంలో తనపై కాశీం రజ్వీ అంటూ తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులు ప్రస్తుతం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడి వెంట ఉంటూ ఇసుక, మట్టి, భూ అక్రమాలకు పాల్పడుతున్నారని పువ్వాడ మండిపడ్డారు.

ఆదివారం జరిగిన ఖమ్మం నగర ఖానాపురం హవేలి పరిధి బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు కల్పించినా బీఆర్‌ఎస్ పార్టీతోనే కార్యకర్తలు ఉన్నారని, పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఎవరి ఉడత ఊపులకు భయపడేది లేదని, తగిన సమాధానం చెప్పేలా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఖమ్మం అభివృద్ధి జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం అభివృద్ధికి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకునే విధంగా ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.