7 May, 2026 | 1:45 AM

బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనిపించుకుంటా..

07-05-2026 01:07 AM

అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’. మే 8న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి, తన కెరీర్ గురించి జో శర్మ చెప్పిన ముచ్చట్లు ఆమె మాటల్లోనే.. “‘ఎం4ఎం’లో నా పాత్ర పేరు రాధ. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా కనిపిస్తా. ఈ సినిమాకు కో-రైటర్‌గానూ పనిచేయడం వల్ల నా పాత్రను చాలా బలంగా డిజైన్ చేసుకున్నా.

ఈ సినిమాకు 15 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు వచ్చాయి. ముఖ్యంగా ‘కేన్స్’ ఫెస్టివల్స్‌లో మా సినిమా గ్లోబల్ ప్రీమియర్ వేశారు. అక్కడ మా సినిమాకు వచ్చిన స్పందన ఎంతో ఆత్మవిశ్వాసం కలిగింది. ఇదొక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఇందులోని సీరియల్ కిల్లర్ మృతదేహాలను రాజా రవివర్మ, పికాసో లాంటి గొప్ప పెయింటర్ల పెయింటింగ్స్ తరహాలో డెకరేట్ చేస్తాడు.

ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు. ప్రతి సీన్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా ఉంటుంది. విడుదల రోజు ఈ సినిమాలో విలన్ ఎవరో చెబితే రూ.లక్ష ఇస్తామని ప్రకటించాం. రాబోయే సినిమాల్లో మంచి గ్లామర్ ఆండ్ యాక్షన్ రోల్స్ చేయాలని ఉంది. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనిపించుకోవడమే నా లక్ష్యం” అని తెలిపారు.