ప్రేక్షకుల కోసం రక్తం చిందిస్తా
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను విజయవాడలో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో రామ్‌చరణ్ మాట్లాడుతూ.. “పెద్ది’ సినిమా నన్ను వ్యక్తిగతంగా ఎంతో మార్చింది. ఇది ఎగిసిపడే వ్యక్తి కథ కాదు.. పడిపోయి మళ్లీ లేచి నిలబడే వ్యక్తి కథ. ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డానని అందరూ అంటున్నారు. కానీ ఇలాంటి సినిమా కోసం కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం? ఇది కష్టంతో చేసిన పని కాదు, ఇష్టంతో చేసిన పని. ఇలాంటి సినిమాలు చేయడానికి నాకు బలం ఇచ్చేది మీరే.
అభిమానులు, ప్రేక్షకులు కోసం చేయి విరగ్గొట్టుకోవడమే కాదు, రక్తం చిందించి కూడా పని చేస్తా. నాకు తెలిసింది సినిమా మాత్రమే. నేను ఉన్నంత కాలం మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటా” అన్నారు. జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. “మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ‘పెద్ది’ చూసిన తర్వాత కూడా ఇదే ప్రేమతో థియేటర్ల నుంచి బయటకు వస్తారని ఆశిస్తున్నా. మన జీవితానికి అర్థం ఏమిటి? మన గుర్తింపు అంటే ఏమిటి? అనే అంశాలను ‘పెద్ది’ చాలా అద్భుతంగా ఆవిష్కరిస్తుంది.
నా జీవితానికి అర్థం ప్రేక్షకులను అలరించడం, నటించడం, మంచి సినిమాలు చేయడం. నా గుర్తింపు కూడా మీ అందరితో ఎంతో బలంగా ముడిపడి ఉంది. మీరందరూ గర్వపడేలా మరిన్ని మంచి పనులు చేస్తానని మాటిస్తున్నా” అని చెప్పింది. ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బుచ్చిబాబు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత వై రవిశంకర్, నిర్మాత వెంకట సతీశ్ కిలారు, మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ కేశినేని చిన్ని, నటులు దివ్యేందు శర్మ, జగపతిబాబు, డీవోపీ రత్నవేలు, పాటల రచయిత అనంత శ్రీరామ్ కూడా మాట్లాడారు.






