9 August, 2026 | 2:25 AM

నేను ఇండియన్ సినిమాకు ఒక కార్మికుడిలా పనిచేస్తా!

09-08-2026 01:06 AM

బెంగళూరు ఈవెంట్‌లో రాకింగ్ స్టార్ యష్ 

రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో యశ్‌తోపాటు నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో బెంగళూరులో శనివారం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కరునాడ చక్రవర్తి శివన్న మాట్లాడుతూ.. “మేమందరం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ట్రైలర్‌లో ప్రతి అంశం మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్‌” అన్నారు. యశ్ మాట్లాడుతూ.. “ఇది నా సినిమా కాదు.. ఇది ఇండియన్ సినిమా.

ఇండియన్ సినిమాను గ్లోబల్ ప్లాట్‌ఫాంపై నిలబెట్టాలనే సంకల్పంతో ఈ సినిమా చేశాం. ఈ సినిమా కచ్చితంగా గుర్తుండిపోతుంది. గీతూ మోహన్ దాస్ విషయంలో ప్రతి ఒక్కరూ చాలా గర్వపడతారు. ఇలాంటి సినిమా చేయడం మామూలు విషయం కాదు. నిర్మాత వెంకట్ ఎప్పుడూ రాజీ పడలేదు. దాదాపు 200 రోజుల పాటు రెండు భాషల్లో ఈ సినిమాను షూట్ చేశాం. ఇందులో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. అందరి పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది.

వారిని చూసి మేమంతా గర్వపడేలా చేశారు. నేను ఇండియన్ సినిమాకు ఒక కార్మికుడిలా పనిచేస్తా. నా బెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తా. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన సినిమా ఇది. ఇందులో రెండు, మూడు విభిన్నమైన లుక్స్‌తో కనిపిస్తా. దానికోసం చాలా సమయం అవసరమైంది. ‘టాక్సిక్’ కచ్చితంగా మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది” అన్నారు. నయనతార మాట్లాడుతూ.. “టాక్సిక్’ నాకు చాలా స్పెషల్ ఫిలిం.

నేను గీతూతో కలిసి గతంలో ఒక సినిమా చేశా. కానీ ఇప్పుడు గీతు పూర్తిగా వేరుగా కనిపించారు. ఈ సినిమా కథను ఆమె మైండ్ బ్లోయింగ్‌గా చెప్పారు. నేను చాలా మంది సూపర్‌స్టార్స్‌తో కలిసి పనిచేశాను. యశ్‌తో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమా కోసం ఆయన నాలుగేళ్ల పాటు తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన చాలా హార్డ్ వర్కింగ్ యాక్టర్. దర్శకులు, నిర్మాతలంటే ఆయనకు ఎంతో గౌరవం.

ఆయనపై నాకు చాలా గౌరవం ఉంది. ఖచ్చితంగా అందరూ ఈ సినిమాను ప్రేమిస్తారని నమ్ముతున్నా” అని తెలిపింది. కియారా అద్వానీ మాట్లాడుతూ.. “నా కెరీర్‌లో ఈ సినిమా చాలా స్పెషల్. బిఫోర్ టాక్సిక్, ఆఫ్టర్ టాక్సిక్’ అని తప్పకుండా అంటారు” అని తెలిపింది. రుక్మిణి వసంత్ మాట్లాడుతూ.. “ఈ సినిమా ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నా. ఇది నాకు ఒక గొప్ప ఎక్స్‌పీరియన్స్‌” అని చెప్పింది. హుమా ఖురేషి మాట్లాడుతూ.. “నేను ఎక్కడికి వెళ్ళిన ఈ సినిమా గురించే అడుగుతున్నారు.

ఇందులో భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది” అని అన్నది. దర్శకురాలు గీతు మోహన్ దాస్ మాట్లాడుతూ.. “కేవీఎన్ వల్ల, మా టీమ్ అందరి హార్డ్ వర్క్ వల్లే ఈ సినిమా సాధ్యపడింది. యశ్ వండర్‌ఫుల్ యాక్టర్. బ్రిలియంట్ ప్రొడ్యూసర్, అద్భుతమైన కో-రైటర్ కూడా. యష్ నాకు పెద్ద ఎమోషన్.

ఈ జర్నీని నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను” అని తెలిపారు. నిర్మాత కేవీఎన్ మాట్లాడుతూ.. “చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా ఇది. చాలా బోల్డ్ విజన్‌తో సినిమాను రూపొందించగలిగాం. ఈ సినిమా అన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. దేశాల సరిహద్దులు దాటి ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నా” అని చెప్పింది. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.