9 August, 2026 | 2:08 AM

రామాయణ విదేశాల్లో రెండ్రోజులు ముందే..

09-08-2026 01:03 AM

రణబీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితేశ్ తివా రీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’. ఈ మహాకావ్యాన్ని మేకర్స్ రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. తొలిభాగం 2026 నవంబర్‌లో రానుండగా, రెండోభాగం 2027 దీపావళి కానుకగా విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఇంగ్లీష్ ట్రైలర్‌లో ‘నవంబర్ 6’ తేదీని ప్రకటించడంతో భారతీయ అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో ఈ సినిమా వచ్చే నవంబర్ 6న విడుదలవుతుండగా, భారతదేశంలో మాత్రం రెండు రోజుల ఆలస్యంగా, దీపావళి పండుగ నాడు అంటే, నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే, ఈ రెండు వేర్వేరు తేదీల వెనుక ఉన్న వ్యూహాన్ని చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. విదేశాల్లో సినిమా పంపిణీ విధానం సాధారణంగా శుక్రవారం ఆధారంగా జరుగుతుంది. అందువల్ల అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం నవంబర్ 6వ తేదీన (శుక్రవారం) సినిమాను విడుదల చేస్తున్నారు. భారతదేశంలో ఈ చిత్రాన్ని దీపావళి పండుగ రోజైన నవంబర్ 8 (ఆదివారం) నేరుగా థియేటర్లలోకి తీసుకురావాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.

పండుగ నాడే భారతీయ ప్రేక్షకులకు ఈ దృశ్యకావ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండియాలో ధర్మ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తుండగా, ఓవర్సీస్ హక్కులను సోనీ పిక్చర్స్ దక్కించుకుంది. సంగీత హక్కులను టీ-సిరీస్ రూ.75 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి, రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్, హనుమంతుడిగా సన్నీ దేవోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ‘డీఎన్‌ఈజీ’ విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తుండగా, ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మెర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.