23-06-2025 01:09:46 AM
ఇటీవల చాలా మంది హీరోయిన్లు తమ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను నిర్మొహమాటంగా భయటపెట్టేస్తున్నారు. అందాల తెలుగు తార అనన్య నాగళ్ల కూడా తన భగ్న ప్రేమ గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య.. తాను కెరీర్లో రాణించే క్రమంలో ఎదురైన ఒడిదుడుకులను పంచుకున్నది. సవాళ్లను స్వీకరించడం అలవాటు చేసుకున్నానని తెలిపింది.
జీవితంలో ప్రేమలో విఫలమైనప్పుడు మాత్రం చాలా బాధ పడ్డానని చెప్పింది. “కెరీర్లో పొగడ్తలు, తెగడ్తలు సహజం. అన్నింటినీ అలవాటు చేసుకున్నా. కానీ వ్యక్తిగత జీవితంలో ప్రేమ విఫలమైనప్పుడు మాత్రం ఆ బాధ భరించలేకపోయా. నేను ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కొంత కాలానికే నాకు బ్రేకప్ అయ్యింది. అది నా జీవితాన్ని రెండేళ్లపాటు వెంటాడింది. ఆ సమయంలో నా బాధను ఎవరితోనూ చెప్పుకోలేని పరిస్థితి.
రాత్రుళ్లు మౌనంగా ఏడ్చేదాన్ని. కానీ ఉదయం లేవగానే నా బాధను మరిచి జిమ్‌కు వెళ్లేదాన్ని. ఇక షూటింగ్‌కు వెళ్లినప్పుడు కారవాన్‌లోకి వెళ్లి ఏడ్చేదాన్ని. ఆ తర్వాత ఏమీ జరగనట్టు కెమెరా ముందుకు వచ్చేదాన్ని. అయినా వర్క్‌పై ఆ ప్రభావం పడనిచ్చేదాన్ని కాదు. ఈ విషయం ఎవరితోనూ పంచుకోలేదు. మా కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదు. నా స్నేహితులకు మాత్రమే నా ప్రేమ విషయం తెలుసు.
నా వ్యక్తిగత జీవితంలోని సమస్యల ప్రభావం నా పని మీద పడకుండా జాగ్రత్తపడ్డా” అని అనన్య తెలిపింది. ఈ ముద్దుగుమ్మ ఇంకా మాట్లాడుతూ సినిమాల్లో అవకాశాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “తెలుగులో 100 సినిమాల్లో 20 శాతమే తెలుగమ్మాయిలకు ఛాన్సులు వస్తున్నాయి.
ఇక్కడ 20 శాతం అవకాశాలే ఉన్నాయి కదా అని తమిళం, మలయాళం కన్నడ, హిందీ ఇండస్ట్రీలకు వెళితే 80 శాతం అవకాశాలు వాళ్లు స్థానిక అమ్మాయిలకు ఇస్తారు. మనకు 20 శాతమే ఇస్తారు. కాబట్టి దేశం మొత్తంలో ఎక్కడచూసినా మనం ఆ ఇరవై శాతంలోనే ఆఫర్స్ రాబట్టుకోవాలనేది అర్థమవుతోంది” అని తెలిపింది.