నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా
ఓడిపోతే వినోద్‌కుమార్ రాజకీయాలు మానుకుంటారా?
భావోద్వేగాలు రెచ్చగొట్టి కేసీఆర్ రాజకీయాలు
బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్
రాజన్న సిరిసిల్ల, మే 10 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్ ఓడిపోతే ఆయనకు రాజకీయాలకు పుల్‌స్టాప్ పెట్టే ధైర్యం ఉందా? అని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు. దమ్ముంటే తన చాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన పార్టీ నేతలతో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం రూ.10 లక్షల కోట్లపై నిధులు ఇచ్చిందన్నారు. ఈ అంశంపై ఎవరైనా చర్చకు వస్తే తాను పేపర్ ప్రెజెంటేషన్ ఇస్తానన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తారని, ఆయనకు సరిసాటి అయిన వ్యక్తి ప్రపంచంలో మరొకరు లేరని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆయన యువతను రెచ్చగొట్టి 1,400 మంది ప్రాణాలను బలి తీసుకున్నారన్నారు. ఎన్నికలప్పుడే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి బయటకు వస్తారన్నారు.
కేంద్రానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ డీపీఆర్ ఇవ్వకుండా, జాతీయ హోదా రాకుండా చేసిన నేత కేసీఆర్‌నే అన్నారు. కాంగ్రెస్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకుని బీఆర్‌ఎస్ తనను ఓడించేందుకు ఓటర్లను ప్రలోభ పెట్టే రాజకీయాలకు తెరలేపారన్నారు. ఆ రెండు పార్టీలు డ్రామాలతో ప్రజల దృష్టిని మళ్లించే యత్నం చేస్తున్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎంత దోపిడీ జరిగిందో ఆ స్థాయిని మించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో దోపిడీ జరుగుతుందని ఆరోపించారు.
తనను ఓడించేందుకు ముస్లింలంతా ఏకం కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, జై శ్రీరామ్ అనొద్దనిఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిస్తున్నారని ఆరోపించారు. 20శాతం ఓట్ల కోసం 80శాతం హిందువులను అవమానిస్తున్న బీఆర్‌ఎస్‌కు ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు. కేటీఆర్ అసలు పేరు అజయ్‌రావు అని, కానీ ఆయన పేరులోకి రాముడు పేరు తెచ్చుకున్నారన్నారు. తాను ధర్మం గురించి మాట్లాడితే మతతత్వ వాదినని ముద్ర వేయాలని కేసీఆర్, కేటీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. ప్రచారంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప పాల్గొన్నారు.






