1 May, 2026 | 4:39 PM

ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో మంత్రినయ్యా

11-05-2024 12:14 AM

ఎప్పటికీ మీ బిడ్డగానే ఉంటా

ఎన్నికల్లో రాజేందర్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలి

గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం 

కరీంనగర్, మే 10 (విజయక్రాంతి): గీత కార్మికుడి బిడ్డనైన తాను ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో మంత్రిని అయ్యానని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా కరీంనగర్‌లోని ఓ కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

35 ఏళ్ల రాజకీయ జీవితంలో డిగ్రీ కాలేజీ అధ్యక్ష పదవి నుంచి మంత్రిని అయ్యానంటే ప్రజల దీవెనలు, ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతోనే అన్నారు. ఎప్పటికీ మీ బిడ్డగానే ఉంటానని, ఏ సహకారం కావాలన్నా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాజేందర్ రావు గెలుపును తన గెలుపుగా భావిస్తున్నానని.. భారీ మెజార్టీతో రాజేందర్ రావును పార్లమెంట్‌కు పంపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, కార్పొరేటర్ కోటగిరి భూమా గౌడ్‌తో పాటు గౌడ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఆర్‌ఎంపీ వైద్యులు దేవుళ్లతో సమానం: ఎంపీ అభ్యర్థి వెలిచాల

ఆర్‌ఎంపీ వైద్యులు ధన్వంతరిలా దేవుళ్లతో సమానమని కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు తెలిపారు. ఆర్‌ఎంపీల దయతోనే పల్లెలోని ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటున్నారని అన్నారు. శుక్రవారం కరీంనగర్ పద్మనాయక ఫంక్షన్‌హాల్‌లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆర్‌ఎంపీ, పీఎంపీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజేందర్‌రావు మాట్లాడుతూ.. గ్రామాలతోపాటు పట్టణాల్లో కూడా ఆరోగ్య సమస్య ఎదురైతే మొదట గుర్తుకు వచ్చేది ఆర్‌ఎంపీ వైద్యుడేనని అన్నారు.

ఆర్‌ఎంపీ వైద్యులకు రాజకీయ పరిజ్ఞానం చాలా ఎక్కువ ఉంటుందని, ఎవరు గెలిస్తే ఎంత అభివృద్ధి చేస్తారో తెలియజేసే ఉన్నదని చెప్పారు. హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించేలా కృషి చేయాలని కోరారు. ఒకసారి అవకాశం ఇచ్చి ఓటేసి గెలిపిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి కరీంనగర్‌ను కోహినూర్‌లా తీర్చిదిదుదతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, ఆర్‌ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కాసం రవీందర్‌రెడ్డి, పద్మాకర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్‌ఎన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.